అసద్‌భాయ్‌కు మాధవీలత చెక్‌.. సంచలనం సిద్ధమా?

పాతబస్తీలో ఈసారి పతంగి దారం తెగుతుందా.. కమలం వికసిస్తుందా.. ఈ చర్చ జోరుగా సాగుతోంది. అసదుద్దీన్ ను కట్టడి చేయాలంటే ఎంపీగా ఓడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో కమలం వికసిస్తోందని ఆ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇది వరకు ప్రకటించిన అభ్యర్థులకు భిన్నంగా ఈసారి అభ్యర్థిని ప్రకటించింది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. హిందుత్వా ఏజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే హిందుత్వవాది మాధవీలతను అసదుద్ధీన్‌పై పోటీకి నిలిపింది.

మాధవీలత కూడా అసదుద్ధీన్‌పై ఘాటు విమర్శలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ మాధవీలత క్రేజ్‌ మామూలుగా లేదు మరి. ఇవన్నీ చూస్తే మాధవీలత అసదుద్ధీన్‌ ఓవైసీపై విజయం సాధించి మజ్లీస్‌ కోటను బద్ధలు కొడుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఒక మహిళా హైదరాబాద్‌ నుంచి విజయం సాధిస్తే చరిత్రను తిరగరాయడమే అవుతుంది. అంతే కాదు.. తొలిసారి మహిళ విజయం సాధించిందనే రికార్డును కూడా మాధవీలత సొంతం చేసుకుంటుంది.

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో బీజేపీకు మంచి ఓటు బ్యాంకే ఉంది. ఇక్కడ పార్టీల కంటే ముస్లిం, హిందూ మతప్రాదికన ఓటర్లు చీలిపోతారు. ఈ నియోజకవర్గంలో పోటీ పంచముఖంగా ఉంటుంది. ఈ పోరులో మైనార్టీ ఓట్లు ఎక్కువగా చీలితే మజ్లీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. దీనికి తోడు హిందూ సంప్రదాయ ఓట్లు చీలిపోకుండా ఉంటే బీజేపీ విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఈ రెండు దశాబ్ధాల్లో బీజేపీ హిందూ సంప్రదాయ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడటంలో విఫలమైంది. ఈ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహాల్‌ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించింది. ఇది బీజేపీ అభ్యర్థికి కలిసివచ్చే అంశం. అయితే గోషా మహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ అభ్యర్థి తరపున ఎక్కడా ప్రచారం నిర్వహించడం లేదు. ఇది కొంత మేరకు ప్రతి కూలంగా మారొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: