తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు యుక్తవయసులో నాటకాలు వేస్తూ..వెండి తెరకు పరిచయం అయ్యారు. సాంఘిక,పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. ఇక దేవదాసు లాంటి చిత్రం అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుందనే చెప్పొచ్చు. తాను చనిపోయే వరకు (మనం) నటనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నాగేశ్వరరావు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ఖాతాలో వేసుకున్నారు. తెలుగు, తమిళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. ఎన్.టి.ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.
మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. అంత గొప్ప నటుడికి నట వారసుడిగా ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున. తర్వాత ఎన్నో మాస్, క్లాస్ చిత్రాల్లో నటించిన ఆయన మన్మధుడు, కింగ్ నాగార్జునుగా పిలవబడుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, ఓ స్టూడియో యజమానిగా, భర్తగా, తండ్రిగా తన జీవితాన్ని అనుభవిస్తున్న హ్యాడ్ సమ్ హీరో నాగార్జున, నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మీరు ఇంత హ్యాపీగా..ఫిట్ నెస్ గా ఉండటానికి కారణం ఏంటీ అన్న ప్రశ్నకు..అవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఒక నటుడిగా, నిర్మాతగా సక్సెస్ అయినట్లు భావిస్తున్నానని..ఇక కుటుంబ పరంగా మంచి భర్త, తండ్రిగా ఉన్నానని త్వరలో మామయ్యను...తాతయ్యను కూడా కాబోతున్నానని అన్నారు.
త్వరలో చైతూ పెళ్లి జరగనుందని, అఖిల్ హీరోగా నటిస్తున్న 'హలో' బాగా వస్తోందని, తాను నటించిన 'రాజు గారి గది-2' కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నామని ఈ కారణాలతో ఇంట్లోని ప్రతి ఒక్కరమూ హ్యాపీగా ఉన్నామని అన్నారు. తన తర్వాత చిత్రం 'రాజు గారి గది-2' చిత్రం గురించి మాట్లాడుతూ..ఇప్పటి వరకు నేను హర్రర్ చిత్రాల్లో నటించలేదని..మొదటి సారిగా ఓ మంచి హర్రర్, కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నానని అన్నారు.
హారర్ సినిమాలను షూట్ చేస్తున్నప్పుడు తనకు భయమేమీ అనిపించదని, సినిమాలు చూసేటప్పుడు మాత్రం ఇప్పటికీ కొన్నిసార్లు రెండు చెవులూ మూసుకుని చూస్తుంటానని చెప్పాడు. పుట్టినరోజు జరుపుకుంటున్న కింగ్ అక్కినేని నాగార్జునకు ఏపీహెరాల్డ్.కామ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.