అన్స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకువెళుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగానే కాకుండా టాక్ షో వ్యాఖ్యాతగానూ రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లో దూసుకువెళుతోంది. అన్స్టాపబుల్ సీజన్ 4లో అనేక మంది నటీనటులు, ప్రముఖులు గెస్టుగా హాజరవుతున్నారు. కాగా, సీజన్ 4 ఎపిసోడ్ 8లో సినీ దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ అతిధులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రహ్మణి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ త్వరలో వెండి తెరపై కనిపించబోతున్నారు. ఈ నేపధ్యంలో బాలయ్య కుమార్తె కు వచ్చిన సినిమా ఆఫర్ గురించి ఆయనే స్వయంగా చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ వేసిన ప్రశ్నపై బాలకృష్ణ స్పందిస్తూ ఈ క్రమంలో ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?’ అని తమన్ అడగ్గా బాలకృష్ణ స్పందించారు.
ఇద్దరినీ గారాబంగానే పెంచానని చెబుతూ మణిరత్నం సినిమా అవకాశాన్ని గుర్తుచేసుకున్నారు.బాలయ్య మాట్లాడుతూ‘‘మణిరత్నం గారు అప్పట్లో ఓ సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణిని అడిగారు. ఆ విషయాన్ని ఆమెకు చెబితే ‘మై ఫేస్’ (నా ముఖం) అని సమాధానమిచ్చింది. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని అన్నా. చివరకు ఆసక్తి లేదని చెప్పింది.తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది. తనైనా నటి అవుతుందని అనుకున్నా. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ షోకు ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ‘వాళ్ల తండ్రిని నేను’ అని చెప్పుకొనే స్థాయికి ఎదిగారంటే అంతకుమించి నాకు కావాల్సింది ఏముంది. నేను భయపడేది బ్రాహ్మణికే’’ అని అన్నారు.అలాగే బ్రాహ్మణికి తన తండ్రి బాలయ్య కాకుండా మరొక హీరో అంటే కూడా చాలా ఇష్టమట. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటన పరంగా, డాన్స్ పరంగా తనకి చాలా ఇష్టమని,చిరంజీవి హీరోగా సినిమా విడుదల అవుతుందంటే చాలు మొదటి రోజే ఈమె సినిమా చూడడానికి వెళుతుందట. ఈ విషయాన్ని బాలయ్యే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు.