పునీత్‌కు టాలీవుడ్‌తో విడ‌దీయ‌లేని అనుబంధాలు ఇవే..!

VUYYURU SUBHASH
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండిల్ వుడ్ తోపాటు యావ‌త్ భార‌త చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో కూరుకు పోయింది. ఆయ‌న మ‌ర‌ణ వార్త విన్న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు పునీత్ తో త‌మ‌కు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక పునీత్ కు టాలీవుడ్ కు మంచి అవినాభావా సంబంధం ఉంది.
పునీత్ మ‌న తెలుగు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగానే హీరోగా లాంచ్ అయ్యాడు. పూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అప్పు సినిమాతో పునీత్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాను తెలుగు లో ర‌వితేజ హీరోగా ఇడియ‌ట్ గా తీశారు. అప్పు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో పునీత్ పేరు మార్మోగి పోయింది. విచిత్రం ఏంటంటే తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ - ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన ఆంధ్రా వాలా ఇక్క‌డ డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ సినిమాను క‌న్న‌డ‌లో మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వీర క‌న్న‌డిగ పేరుతో రీమేక్ చేస్తే సూప‌ర్ హిట్ అయ్యింది.
ఇక మహేష్ బాబు - గుణశేఖర్ కాంబోలో వ‌చ్చిన ఒక్క‌డు సినిమాను అక్క‌డ అజ‌య్ పేరుతో తీశారు. ఈ సినిమాను కూడా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేశారు. ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఇక ర‌వితేజ - పూరి కాంబోలో వ‌చ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాని కన్నడలో మౌర్య గా రీమేక్ చేస్తే అది కూడా సూప‌ర్ హిట్‌. ఇక మ‌హేష్ బాబు దూకుడును ప‌వ‌ర్ పేరుతో తీస్తే అది కూడా సూప‌ర్ హిట్‌. ఈ సినిమాను మ‌న తెలుగు నిర్మాత‌లు రామ్ ఆచంట - గోపీ ఆచంట - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.
పునీత్ చక్రవ్యూహ సినిమా కోసం థమన్ సారథ్యంలో ఎన్టీఆర్ గెల‌యా సాంగ్ పాడారు. ఇక పునీత్ కెరీర్ లో చివ‌రగా వ‌చ్చిన సినిమా యువ‌ర‌త్న‌. ఇది తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఒకే సారి రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం పునీత్ జేమ్స్ - ద్విత్వ సినిమాలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: