రావికొండల రావు మరణంపై పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటంటే .....??
ప్రముఖ నటుడు, రచయిత అయిన రావి కొండలరావు కాసేపటి క్రితం మరణించారు. కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన, నేడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తన యుక్త వయస్సులో ఎన్నో నాటకాల్లో నటించి రంగస్థల నటుడిగా మంచి పేరు గడించిన రావి కొండల రావు, ఆ తరువాత టాలీవుడ్ సినిమా పరిశ్రమకు శోభ సినిమా ద్వారా ప్రవేశించారు. ఆ సినిమాలో డాక్టర్ పాత్రలో కొన్ని క్షణాలు నటించిన రావి కొండల రావు, ఆ తరువాత అప్పటి దర్శకులు బి. ఎన్. రెడ్డి, ఏఎన్నార్ తో తీసిన పూజా ఫలము సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసారు. అనంతరం కమలాకర కామేశ్వర రావు, ఎన్టీఆర్ తో తీసిన నర్తనశాల సినిమాకు సహాయ దర్శకుడిగా, అలానే ఆ సినిమాలోని కామెడీ ట్రాక్ ని కూడా ఆయన రాయడం జరిగింది. అనంతరం ఒక్కొక్కటిగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న రావి కొండలరావు, ప్రముఖ దర్శకుడు బాపు రమణలకు మంచి సన్నిహితులు, అలానే అప్పట్లో కొన్నాళ్ల పాటు ముళ్ళపూడి వెంకటరమణ తో కూడా కలిసి ఉండేవారు రావి. అనంతరం తన సహచర నటులతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించిన రావి, ఆ తరువాత బంగారు పాప పేరుతో పత్రిక నెలకొల్పారు.
శ్రీ రావి కొండలరావు గారు బహుముఖ సేవలు అజరామరం - janasena Chief Sri @PawanKalyan pic.twitter.com/n2edQjb5aH — janasena party (@JanaSenaParty) July 28, 2020
అక్కడి నుండి పాత్రికేయుడిగా, అలానే నటుడిగా వరుసగా తెలుగు సినిమా రంగంలో పలు సినిమాలలో నటిస్తూ, రచయితగా కథలు అందిస్తూ సాగిన రావి కొండలరావు, రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి ల కలయికలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించి పలు అవార్డులు కూడా అందుకున్నారు. మొన్నటి వరకు పలు సినిమాల్లో అక్కడక్కడా నటిస్తూ వస్తున్న రావికొండల రావు, ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే నేడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి, ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మనల్ని అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు సినిమాకు ఎన్నో రకాలుగా విశేష సేవలు అందించిన రావికొండలరావు మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రావి కొండలరావు మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.
కాగా కొద్దిసేపటి క్రితం నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రావికొండల రావు మరణంపై ఒక ప్రకటన విడుదల చేసారు. తెలుగు సినీ రంగానికి రావి కొండల రావు గారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, అన్నయ్య చిరంజీవితో కలిసి ఆయన, చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు సినిమాల్లో నటించారని, అలానే ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయనను కలిసినపుడు, సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నాం అని, అటువంటి వ్యక్తి నేడు మనల్ని అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం అని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపారు పవన్ .....!!