ప్రపంచవ్యాప్తంగా రజినీ అభిమానులు ఎప్పుడా..? ఎప్పుడా..? అని ఎదురు చుస్తున్న ‘కొచ్చడియన్’ సినిమా విడుదల కు నేటి నుంచి కౌంట్ డౌన్ మొదలు అయిందనే అనుకోవాలి. ఈ సినిమా ఆఫిసియల్ టీజర్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ధర్శకరాలు రజినీకాంత్ కుమార్తె సౌందర్య విడుదల చేశారు. 1.14 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ నిశితంగా పరిశీలిస్తే సౌందర్య చెపుతున్న స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఈ టీజర్ లో పెద్దగా ఏమీ కనిపించలేదు.
రజినీకాంత్ రూపాన్ని కూడా ఇంచుమించు యానిమేషన్ పిక్చర్ గా మల్చినట్లే కనిపించింది కాని అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు తయారు చేసిన సినిమాలా మాత్రం అనిపించదు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు రజినీకాంత్ కూడా ఒక నిర్మాత అనే టాక్ ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ దర్శక పర్యవేక్షణలో రజినీ కుమార్తె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల రూమర్స్ బయటకు రావడం తో రజినీ అభిమానులలో ఖంగారు బయలు దేరింది. లేటెస్ట్ గా ఈరోజు విడుదల అయిన ఈ టీజర్ ఆ రూమర్స్ ను బలపరచేటట్లుగానే ఉంది కాని ఒక అద్భుతమైన సినిమాకు టీజర్ గా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అనిపించదు. హాలీవుడ్ మూవీ అవతార్ సినిమా టెక్నాలజీ మోషన్ కాప్చర్ టెక్నాలజీ అద్భుతాలు ఏమీ ఈ టీజర్ లో కనిపించవు. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ సింహ’ గా కూడా డబ్ చేస్తున్నారు.
రజినీ కుమార్తె సౌందర్య చెపుతున్న అంతర్జాతీయ ప్రమాణాలు ఎలా ఉన్నా, కనీసం ఈ సినిమా రజినీకాంత్ పరువును నిలబెట్టు తుందా..? అనే అభిప్రాయం ఈ టీజర్ ను చూసిన వారికి వస్తుంది. దీపిక పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ 150 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషలలోనే కాకుండా చైనా,జపాన్, రష్యా భాషలలో కూడా డబ్ చేయబడి విడుదల కాబోతోంది. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా చివరకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.