బాలయ్య నా ... మజాకా...!! అంటున్న నెటిజన్లు...!!

murali krishna
ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ.
కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నారు. అలా సుదీర్ఘ కాలంగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాదే భారీ విజయంతో కమ్‌బ్యాక్ అయ్యారు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన థియేట్రికల్ డీల్ వివరాలు బయటకు వచ్చాయి.
 
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు.
'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.
గోపీచంద్ - బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే టర్కీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌ను సైతం షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా హక్కులకు అప్పుడే పోటీ ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ నైజాం ఏరియా హక్కుల కోసం చాలా మంది బడా ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏరియా హక్కుల కోసం ఒక టాప్ ప్రొడ్యూసర్ ఏకంగా రూ. 18 కోట్లు ఆఫర్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది.
బాలయ్య నటించిన 'అఖండ' మూవీ నైజాం హక్కులు రూ. 10.50 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేశారు. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ఏకంగా రూ. 22 కోట్ల వరకూ షేర్ రాబట్టింది. దీంతో ఇప్పుడు గోపీచంద్ తెరకెక్కించే సినిమాకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఒక్క నైజాం ప్రాంతానికి సంబంధించిన హక్కులకు రూ. 18 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: