హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యే ‘బినామీ’ పాలిటిక్స్ !

తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు పనిచేసి పెట్టడం కంటే...సొంత పనులని చక్కదిద్దుకోవడంలో ముందున్నారని తెలుస్తోంది. అధికార పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే తీరులో ఉన్నారని ఇంటిలిజెన్స్ వర్గాల నివేదికలో బయటపడుతున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డిది ఇదే వరుస అని ఆరోపణలు వస్తున్నాయి. దేవరకద్ర నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ...అధికారంలో ఉండటంతో బినామీల పేరిట బాగానే ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలో ఈయన అనుచరుల భూ కబ్జాలకు కూడా కొదవ లేదని టాక్.
ఏదో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలని మాత్రం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరే నియోజకవర్గంలో అనుకున్న మేర అభివృద్ధి కనిపించడం లేదు. పలు గ్రామాల్లో రోడ్ల పరిస్తితి అధ్వాన్నంగా ఉంది. అటు భూత్పురు నుంచి నాగర్‌కర్నూలు వెళ్ళే రోడ్డు గుంతలమయం. ఇక దేవరకద్రలో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన వచ్చింది గానీ..ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పూర్తి కాలేదు. తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే...ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు సరైన ప్రత్యర్ధి ఉంటే...గెలవడం చాలా కష్టం. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త బలం ఉంది. కానీ ఆ పార్టీలో బలమైన నాయకులు లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కుమార్ బీజేపీలోకి వెళ్లిపోయారు.
మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్‌ అనే ఇద్దరు నాయకులు ఇంచార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డికి మంచి పట్టు ఉంది. 2009లో ఆయన భార్య సీతా దయాకర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో రేవంత్ దయాకర్ ఫ్యామిలీని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి దేవరకద్ర బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దయాకర్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు టఫ్ ఫైట్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: