భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

Suma Kallamadi
ప్ర‌జ‌లంద‌రికి జీవ‌వైవిధ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌టం కోసమే ఐక్య‌రాజ్యస‌మితి మే 22న అంత‌ర్జాతీయ జీవ‌వైవిధ్య దినోత్స‌వంగా ప్ర‌క‌టించింది. జీవవైవిధ్యం మనమందరం ఎదుర్కొంటున్న అనేక స్థిరమైన అభివృద్ధి సవాళ్లకు సమాధానంగా ఉంది. భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం అనే చెప్పొచ్చు. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో మనదేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు మనదేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది.
వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు మనదేశంలో అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి. అందుకే మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని అరికట్ట‌డం, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించ‌కోవ‌టం అందరి బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: