ప్రపంచానికే ఫిలిగ్రీ నగిషీ కళలో ప్రఖ్యాతి గాంచిన మన కరీంనగర్


ఫిలిగిరీ అనబడే అలంకరణ లేదా నగిషీ ఆభరణాలు తయారీ కోసం ఒక ప్రత్యేకత కలిగిన జువెల్ తయారీ విధానం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ధానికి ముందే మనదేశంలో  వినియోగంలో ఉంది. స్వభావ సిద్ధంగా ఆభరణాలను వినియోగించటం మానవజాతి సహజగుణం. ఈ ఫిలిగిరీ నగిషీ ముఖ్యంగా వెండి జువెలరీ తయారీ విధానం మన కరీంనగరం కేంద్రంగా తొలి నుంచీ అంటే అనాది కాలం నుండి ప్రాచుర్యంలో ఉంటూవస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాల నుండి లభించిన ఆధారాల ప్రకారం ప్రపంచమంతా వ్యాపితమై ఉందని తెలుస్తుంది. 


ఈ పిలిగిరీ ఆభరణ తయారీ కళ తొలుత గ్రీక్స్, ఎత్రూస్కాన్స్ జాతి జనుల కాలంలో క్రీస్తు పూర్వం ఆరు నుండి మూడో శతాబ్ధ కాలానికి అత్యున్నత నైపుణ్యస్థాయికి చేరు కుందని చరిత్ర కారుల అభిప్రాయం. దాదాపు అదే కాలములో ఉభయ ప్రాంతాల మద్య సాంస్కృతిక, వ్యాపార, వస్తు, విఙ్జాన, వినిమయానికి చిహ్నంగా మన వద్ద కూడా అదే కళ విస్త్రుతంగా వినియోగంలో ఉంది.


ఇదంతా భారత ఉప ఖండానికి గ్రీక్ తో ఉన్న సన్నిహిత పరస్పర సాంస్కృతిక ప్రభావంతో వ్యాపించిన కళ ఇది. అదే సమకాలీన కాలములో కోటిలింగాల, ధూళికోట, కొండాపురం మొదలైన ప్రదేశాల్లో కూడా ప్రాచుర్యం సంతరించుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాంకేతికత పని వారల వృత్తి  నైపుణ్యం దాదాపు సమకాలీన కాలములో విరాజిల్లినట్లు పురాతత్వ త్రవ్వకాల్లోనే కాదు సాహిత్య గ్రంధాల ద్వారా కూడా అధారాలు లభించాయి.


అతి సున్నితమై మెలిదిరిగే మెత్తటి గుణమున్న వెండి బంగారు లోహాలతో పొడవైన తీగలను సిద్ధం చేసి వాటి ఇరు చివరల ను “బోరాక్స్ పొడిని-బ్లౌపైపు” సహాయం అతి కిస్తారు. వెండి బంగారులోహాల తీగలను అల్లికగా మెలితిప్పి అతిసన్నగా సాగ దీసి వివిధ ఆకృతులను సృష్టించి జూకాలు నెక్లేసులు నాశికాభరణాలకు అదనంగా సొగసు లద్దే విధంగా తయారు చేస్తారు.


కాకతీయులు చాళుక్యులు విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ నగిషీ వస్తువులను చెవి, ముక్కు, నుదురు, మెడ, చేతు లకు,  కాళ్లకు, నడుముకు ఇలా దేహంలోని భాగాలకు నగిషీ ఆభరణాలు తయారు చేసేవారు. మంగళ సూత్రాలు తయారుచేసేవారు. అవి పెండెంట్స్, లాకెట్స్, కాసులు, పాపిటబిళ్ళలు, నాశికాభరణం, గాజులు, కంకణాలు, వడ్రాణాలు మొదలైన ఆభరణాలు తయారు చేస్తారు.  క్రమంగా ఈ నగిషీ ఆభరణ వినియోగ నాగరికత భారత  దేశమంతా వ్యాపించింది. ఈ ఆభరణాలు దేవతా మూర్తులకు ఆభరణాలుగా వినియోగించటం ఆచారంగా వస్తుంది. అలాగే పూజాసామానులు కూడా ఈ పిలిగిరీ కళతో తయారు చేసేవారు. 

 

ఈ ఆభరణాలు తయారు చేసే కేంద్రాలుగా ఒరిస్సాలోని కటక్, తమిలనాడులోని తిరుచ్చిరాపల్లి, త్రిపురలోని అగర్తల, రాజస్థాన్లోని కోట, కేరళలోని తిరువనంతపురం తెలంగాణాలోని కరీంనగర్ ప్రఖ్యాతిగాంచాయి ఇప్పటికీ ఆ కళ ఈ కేంద్రాల్లో విరాజిల్లుతున్నది.


ఈ కళతో వెండి బంగారు లోహాలపై పువ్వులు ఆకులు సర్పాకృతి ఇలా ఇంకా ఎన్నోరకాల నగిషీలతో చేసిన వస్తువులు అంటే పళ్ళాలు, పంచపాత్రలు, గ్లాసులు, చంచా లు ఇలా పూజాసామాన్లు మాత్రమే కాకుండా నగిషీ అలంకరణ వస్తువులు షోకేసు అలంకరణకు వినియోగించే బొమ్మలు, పూలబుట్టలు, పళ్ళబుట్టలు, టీ టిఫిన్ తదితరాల సర్వింగ్ ట్రెలు, పథకాలు ఙ్జాపికలు తయారు చేయటంతో పిలిగిరి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 


ఫొటోఫ్రేముల, యాష్ట్రేలు, సిగరెట్ కేసులు, సుగంధ ద్రవ్యాలను నింపుకునే బహుళ కంపార్ట్మెంట్లున్న పాత్రసామాగ్రి. పుష్ప పాత్రలు, షాండ్లియర్లు, పన్నెరు అత్తరు  చిలకరించే పాత్రలు మొదలైన వస్తువులెన్నో సృజనాత్మకంగా తయారీ జరుగుతూనే ఉంది ఈ కళకు సృజనకు ఎంతో సంబంధం ఉంది. ఫిలిగిరీ నగిషీ కళను సృజనకు చిహ్నంగా తీర్చి దిద్దారు నైపుణ్యం సాధించిన కళాకారులు.


ఈ మద్య హైదరాబాద్‌లో జరిగిన "అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017" కు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ బహుమతులు గా ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ ఫిలిగ్రీ కళలో నిష్ణాతులైన నగిషీ కళాకారులతో  ప్రత్యేక కానుకలు తయారు చేయించింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇక్కడ రూపొందించిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్టికల్స్‌నే కానుకలుగా ఇచ్చారు.


ఇందులో చారిత్రక చార్మినార్, కాకతీయుల కళాతోరణం, జాతీయ పక్షి నెమలి, వీణ, హంస జ్ఞాపికలను రూ.40 లక్షల వ్యయం తో ప్రభుత్వం తయారు చేయించింది. ఔత్సహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు దేశ, విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు అందజేసేందుకు సీఎం కేసీఆర్ తన అభిరుచికి తగినట్టు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులను తయారు చేయించింది.



మూడు కిలోల వెండితో 18 అంగుళాల చార్మినార్‌ను రూ.2.50 లక్షలతో, 4 కిలోల వెండితో 20 అంగుళాల పొడువున కాకతీయ కళా తోరణం, నెమలి, వీణ, హంస జ్ఞాపికలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయని సమాచారం. తద్వారా ప్రభుత్వం కూడా ఈ కళకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లే. ఈ వస్తువుల తయారీకి వినియోగించే వెండి  తదితర లోహాల బరువు ఆధారంగా కాకుండా పనితరం ఆధారంగా వీటి ధరను నిర్ణయించటం ఆనవాయితీగా వస్తుంది. అంటే సృజనను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నట్లుగానే భావించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: