మళ్లీ విదేశాలకు రేవంత్ రెడ్డి.. ఈ సారి ఎన్ని వేల కోట్లో?
రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కూడా ఆయన సీఎం కాగానే 2024లో దావోస్ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారమని ఘనంగా చెప్పారు. ఆ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే అవి ఎంత వరకూ వచ్చాయో తెలియదు. చెప్పుకోదగ్గ కంపెనీలు తరలి వచ్చినట్టు అయితే కనిపించట్లేదు.
అయితే గత ఏడాది కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చే ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాదు.. ఈ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీమ్ ప్లాన్ చేసిందట. ఇక సీఎం విదేశీ పర్యటన దావోస్ కంటే ముందే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆయన జనవరి 13 లేదా 15న ఆస్ట్రేలియాకు వెళ్తారు. అయితే 13న కాకుండా సంక్రాంతి పండగ తర్వాత 15న బయలుదేరే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వంటి వారు వెళ్తారు. ఆస్ట్రేలియాకు ఎందుకంటే.. అక్కడ క్వీన్స్‌లాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలిస్తారట. ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం.. సీఎం రేవంత్ బృందం జనవరి 19న సింగపూర్ కూడా వెళ్తుందట. అక్కడ షాపింగ్‌మాల్స్, క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారట. ఆ తర్వాత దావోస్ వెళ్తారు.