సోనియా ప్రధాని పదవి మన్మోహన్ సింగ్ కి ఎలా వచ్చింది..? ఇంతకీ ఆ రోజు రాత్రి సోనియా గాంధీ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా..?

2004 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, దేశానికి తదుపరి ప్రధాని అవుతారనే చర్చ సర్వత్రా మొదలైంది.  దీన్ని బీజేపీ, ముఖ్యంగా సుష్మా స్వరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ వ్యతిరేకతను అంత సీరియస్‌గా తీసుకోలేదు.  సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల నేతలంతా సోనియా గాంధీతో భేటీలు జరుపుతున్నారు. కానీ, ఒక్క ఘటన తర్వాత తాను ప్రధానమంత్రి పదవిని తీసుకోలేనని సోనియా తేల్చి చెప్పారు.


2004 మే 17. దిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జనపధ్‌లో మధ్యాహ్నం ఒక సంఘటన జరిగింది.  సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్‌ సింగ్, సుమన్ దుబే ఒక సోఫాపై కూర్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఉద్దేశిస్తూ మాట్లాడారు.  ''అమ్మా, మిమ్మల్ని ప్రధానమంత్రి కానివ్వను. నా తండ్రిని హత్య చేశారు. మా నాన్నమ్మను చంపేశారు. ఒకవేళ మీరు కూడా ప్రధానమంత్రి అయితే వచ్చే ఆరు నెలల్లో మిమ్మల్ని కూడా చంపుతారేమో'' అని రాహుల్ గాంధీ అన్నారు.



సోనియా కళ్లలో నుంచి కన్నీరు రావడంతో హాలులో అంతా నిశ్శబ్ధం అలుముకుంది. తర్వాతి 15-20 నిమిషాల వరకు అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ''మీరు లోపలికి వెళ్లండి. మేం చూసుకుంటాం'' అని సోనియాతో నట్వర్ సింగ్ అన్నారు.  ''హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్'' అనే పుస్తకంలో నీర్జా చౌదరీ ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన తీవ్ర హెచ్చరిక కారణంగానే సోనియా గాంధీ, ప్రధాని కావాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని నట్వర్‌సింగ్ తెలిపారు.


సోనియా గాంధీ ఒక తల్లిగా తన కుమారుని ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని నట్వర్ సింగ్ చెప్పినట్లు పుస్తకంలో ఆమె పేర్కొన్నారు. అదే రోజు సోనియాగాంధీ, 10 జన్‌పథ్‌లో సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ మాటలు విన్న తర్వాత సోనియా గాంధీ బరువెక్కిన హృదయంతో ఈ మీటింగ్‌కు వెళ్లారు. ''ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సిందిగా మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థిస్తున్నా'' అని వచ్చీ రాగానే సోనియా గాంధీ ఈ ప్రకటన చేశారు. అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.


''మేడమ్, మీ ప్రతిపాదనకు కృతజ్ఞతలు. కానీ, నాకు మెజారిటీ లేదు. కాబట్టి దీన్ని నేను అంగీకరించలేను'' అన్నారు మన్మోహన్ సింగ్. వెంటనే నట్వర్ సింగ్ జోక్యం చేసుకన్నారు. ''మన్మోహన్ సింగ్‌కు కాదనే హక్కు లేదు. ఎందుకంటే మెజారిటీ ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నారు'' అని అన్నారు.


ప్రధానమంత్రి పదవిని అంగీకరించవద్దని అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా సోనియాకు సూచించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, సోనియా, వాజ్‌పేయిల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కాంగ్రెస్‌ గెలవగానే సోనియా గాంధీ వాజ్‌పేయికి ఫోన్ చేసి ఆయన ఆశీస్సులు అడిగారు. అప్పుడు ఆయన, 'మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆ కిరీటాన్ని ధరించవద్దు. ఇది దేశంలో అశాంతికి కారణమవుతుంది' అని అన్నారు. అలా 'విదేశీ వనిత' అంటూ ప్రతిపక్షాల విమర్శల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పీఠానికి దూరమయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: