ఇది జగన్ ఓటమే.. బాబు గెలుపు కాదు.. పత్రికాధిపతి షాకింగ్‌ రాతలు?

మొన్నటి ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. 2019లో 151 సీట్లు గెలుచుకున్న జగన్‌ ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోతారని ఎవరూ ఊహించలేదు. సరిగ్గా చెప్పాలంటే టీడీపీ నేతలు కూడా ఈ స్థాయి గెలుపును అంచనా వేయలేకపోయారు. పోటీ హోరాహోరీగా ఉందని.. ఎవరు గెలిచినా.. ఓడిన వారికి కనీసం 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. చంద్రబాబు బంపర్‌ మెజారిటీలతో గెలిచారు. ఏకంగా 164 స్థానాలతో కూటమి విజయ ఢంకా మోగించింది.

అయితే.. ఇది జగన్‌ ఓటమి తప్ప చంద్రబాబు గెలుపు కాదని అంటున్నారో పత్రికాధిపతి. నిత్యం చంద్రబాబు భజన చేస్తారని పేరున్న ఆ పత్రికాధిపతే ఇలా కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగానే ఇటీవలి కాలంలో ప్రజలు తీర్పు ఇస్తున్నారని సదరు పత్రికాధిపతి సూత్రీకరించారు. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చింది మాత్రమేనని ఆ పత్రికాధిపతి కుండబద్దలు కొట్టేశారు.

తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య పొత్తు కుదిరినందున మెజారిటీలు పెరిగాయంటున్న ఆ పత్రికాధిపతి.. గత ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు తగు విధంగా అడుగులు వేస్తారని ఆశిద్దామంటున్నారు. సదరు పత్రికాధిపతి రాతలు ఆలోచించపజేస్తున్నాయి. సాధారణంగా చంద్రబాబుకు మేలు జరిగితే.. ఆహా.. ఓహో.. ఆయన గొప్ప అని భజన చేసే అదే పత్రికలో.. ఇది చంద్రబాబు గెలుపు కాదు.. కేవలం జగన్ ఓటమి అని పత్రికాధిపతి రాయడం అంటే సాధారణ అంశం కాదు.

అంతే కాదు.. ఇప్పుడున్న సమాజంలో కళ్లెదురుగా హత్యలు చేసిన, చేయించిన వారికి కూడా కుల, మత ప్రాతిపదికన ఎన్నో కొన్ని ఓట్లు వేసేవారు ఉన్నారని నిష్టూరం ఆడుతున్నారా పత్రికాధిపతి. అలాగని జగన్‌రెడ్డిని తీసిపారేయడం కూడా సరికాదని... చంద్రబాబు ప్రభుత్వం మును ముందు ఎలా వ్యవహరించబోతున్నది అన్న దాన్ని బట్టి జగన్‌ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారాయన. ఏదేమైనా ఇది జగన్ ఓటమి మాత్రమే అని రాయడం టీడీపీ శ్రేణులకు మాత్రం మింగుడుపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: