జగన్ ఓటమికి దారి తీసిన కీలక తప్పులు ఇవేనా?

ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అవునన్నా.. కాదన్నా ఈ పార్టీ అధినేత ఈ ఓటమికి బాధ్యత వహించాలి. ఓటమికి పలు కారణాలు ఉన్నప్పటికీ పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు.. వ్యవహారశైలే గెలుపోటముల్లో కీలకంగా మారతాయి. ఈ నేపథ్యంలో జగన్ ఏకపక్ష నిర్ణయాలే పార్టీ కొంప ముంచాయని పలువురు విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీని పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించనే లేదు. నామమాత్రంగా పార్టీ పదవులను కట్టబెట్టి బాధ్యతలను మంత్రులకు అప్పజెప్పారు. దీంతో వారి మధ్య సమన్వయం లేకుండా పోయింది.

 పైగా పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు జగన్ వద్దకు వెళ్లలేకపోయాయి. ఎంత సేపటికి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, ఉపన్యాసాలు ఇవ్వడం ప్రత్యర్థులను విమర్శించడం ఇది ఒక రొటీన్ ప్రోగ్రాంలా జరిగిపోయాయి. పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేకుండా పోయింది. జనానికి పార్టీ ఎందుకు దూరమైందో ఇప్పటికీ అయినా సమీక్ష జరిపారా లేదో అన్నది జగన్ కే తెలియాలి. ఇక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన రోడ్ల అంశాన్ని జగన్ లైట్ తీసుకున్నారు. డబ్బులు ఇస్తున్నాం.. తప్పకుండా వారు మనకే ఓటు వేస్తారు అనే భావనలో వైసీపీ అధినేత ఉండిపోయారు. దీంతో పాటు ద్వేషపూరిత మాటలు, అహంకార పూరిత వ్యాఖ్యలు చేసే నాయకులను జగన్ ఎంకరేజ్ చేశారు. దీంతో పాటు ఆయన కూడా వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లారు.

ఒక హుందాతనం మిస్ అయింది. పార్టీ నాయకులు ఎంత దిగజారి మాట్లాడినా ఆయన మందలించకపోవడంతో పార్టీలో క్రమశిక్షణ కరవైంది. దీంతో జనాల్లో అసహ్యం కలిగింది. క్షేత్ర స్థాయిలో అవినీతి, దౌర్జన్యాలు చేస్తున్నారని తెలిసినా.. వారిపై చర్యలు తీసుకోలేదు.  పార్టీని నమ్ముకున్న వారికి కాంట్రాక్టులు ఇవ్వకపోవడం, ఇచ్చినా వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ క్యాడర్ కి, ప్రజలకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడంతోనే ఇంత భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: