బాబు కేబినెట్‌: సీనియర్లకు చెక్‌.. బెడిసికొడుతుందా?

చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్లకు పెద్దగా అవకాశాలు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా.. వారందరినీ కాదని 75 శాతం వరకూ కొత్తవారికే చంద్రబాబు అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం అవకాశం దక్కిన వారిలో లోకేశ్‌ను మినహాయిస్తే.. ఆనం రామనారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎన్‌.ఎమ్‌.డి.ఫరూక్‌, పి.నారాయణ వంటి వారు మాత్రమే గతంలో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. మిగిలిన వారంతా కొత్తవారే.

పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నారు. వారిలో కొందరైతే.. ఇక ఇప్పుడు అవకాశం దక్కకపోతే.. వారి రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుంది. అలాంటి వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కోట్ల, కళా వెంకట్రావు వంటి వారు ఉన్నారు. వీరే కాకుండా పదవులు ఆశించిన వారిలో గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాటి, పరిటాల సునీత వంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని పరిగణలోకి తీసుకోకుండా ఎక్కువ భాగంగా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వివాదాస్పదంగా మారింది.

పార్టీలో కొత్త రక్తం ఎక్కించడం, కొత్త వారికి అవకాశాలు కల్పించడం మంచిదే అయినా అది బ్యాలన్స్ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా చంద్రబాబు మెజారిటీగా జూనియర్లు, కొత్త వారి వైపు మొగ్గు చూపడం బెడిసికొడుతుందేమో అన్న వాదన వినిపిస్తోంది. కొత్త మంత్రులు అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రమాదం ఉందని కొందరు వాదిస్తున్నారు.

అయితే.. పేరుకు మంత్రులు ఉన్నా.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెత్తనమంతా సీఎం వద్దే కేంద్రీకృతం అవుతోంది. ఇలాంటి సమయంలో మంత్రులుగా ఎవరు ఉన్నా చల్తీగా నామ్‌ గాడీ అన్న తరహాలో నడిచిపోతుంది. అందువల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న వాదన కూడా ఉంది. అయితే.. సీనియర్లలో తలెత్తిన అసంతృప్తిని చంద్రబాబు పరిగణలోకి తీసుకుని చల్లార్చకపోతే.. ఆ అసంతృప్తి జ్వాలలు క్రమంగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: