చిత్రం భళారే విచిత్రం: ఆంధ్రా ఎన్నికల్లో మారుమోగిన తెలంగాణ పాట?

తెలంగాణ అస్తిత్వానికి మూలం సాంస్కృతిక కార్యక్రమాలు. మా సంస్కృతిని కించపరుస్తున్నారంటూ తెలంగాణ ఉద్యమం మొదలైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు, కళాకారులదే కీలక పాత్ర. తమ ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగారు. ఎక్కడ సభలు పెట్టినా తెలంగాణ యాసతో పాటలు పాడి.. ఉద్యమానికి ఊపిరిలూదారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాసను కామెడీ టైమింగ్ కోసం వాడేవారు. ఇప్పుడు అదే యాస చాలా న్యూస్ ఛానళ్ల భాష అయింది. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ యాసకి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ యాసతోనే సినిమాలు నిర్మితమవుతున్నాయి. హీరోలు హిట్లు అందుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ వాసులు అనుకున్నది సాధించగలిగారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సమయంలో ఆంధ్రాలో ఉద్యమాలు జరిగినా.. తెలంగాణ మాదిరి ఊపు రాలేదు. దీనికి కారణం సాంస్కృతిక కార్యక్రమాలే అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

వాస్తవానికి రాయలసీమ మాండలీకం, ఉత్తరాది యాస, గోదారోళ్ల ఎటకారం ఇవన్నీ ప్రత్యేక గుర్తింపును సాధించాయి. కానీ వీటిని వాడుకలో ఏపీ ప్రజలు వెనుకబడుతున్నారు. తాజాగా ఇప్పుడు చూసుకుంటే ఏపీ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ ఆయా పార్టీల ప్రచార గీతాలు చూసుకుంటే.. తెలంగాణ యాసతో ముడిపడి ఉన్నాయి. నల్గొండ గద్దర్ గా పేరుగాంచిన నర్సన్న ప్రస్తుతం ఫేమస్ అయిపోయారు. ఈయన్నీ ఏమీ తప్పు పట్టడం లేదు. జెండలు జత కట్టడమే నీ ఎజెండా.. జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా.. బలిరా బలి బలిరా పాట ఎంత పాపులర్ అయిందో మనం అంతా చూశాం.

దీంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీలు సైతం ఈయన చేత పాటలు రాయించుకొని పాడించుకున్నాయి. ఇవి పక్కా తెలంగాణ యాసతో ఉన్నాయి. ఈ పాటల్లో తెలంగాణ భాష ఉట్టిపడేలా ఉంది. అంటే ఏపీ ప్రజలు వాళ్ల భాష కన్నా.. తెలంగాణ యాసకు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఏపీ ప్రజలు, పార్టీలు ఆంధ్రా గాయకులను, కళాకారులను, యాసను పక్కన పెడుతున్నారు. ఫలితంగా తెలంగాణ వెళ్లి వాళ్ల గాయకులను, యాసను ఏపీకి అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: