పురంధేశ్వరి గెలుపు సాధ్యమేనా.. ఓడితే పరిస్థితి ఏంటో?

Suma Kallamadi
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రస్తుతం కూటమి తరుపున రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె గెలుస్తుందో లేదో జూన్ 4న తేలనుంది. తొలిసారి ఆమె 2004లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. తొలిసారి బాపట్ల, రెండోసారి విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆమెకు అవకాశం దక్కింది. తనదైన ప్రసంగాలతో ఆమె గొప్ప రాజకీయ నేతగా అంతర్జాతీయ వేదికలపై పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ద్వారా పదేళ్ల పాటు ఆమె రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజనతో ఆమెకు రాజకీయంగా గడ్డు కాలం మొదలైంది.

 ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి బీజేపీ తరుపున పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు. మరోసారి 2019లో బీజేపీ ఒంటరిగా దిగింది. దీంతో ఆమె విశాఖపట్నం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పొత్తులు లేకపోవడంతో ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఏపీలో మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన విశాఖ నుంచి కాకుండా రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగారు. అయితే అక్కడ ప్రస్తుత ఎన్నికల్లో ఫలితాలు ఆశించినట్లు లేనట్లు తెలుస్తోంది. ఆమె విశాఖ నుంచి పోటీ చేసి ఉంటే బాగుండేదనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం రాజమండ్రి నుంచి పోటీ చేసిన పురంధేశ్వరికి గెలుపు అవకాశాలు సగం మాత్రమే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. సీటు ఎంపిక విషయంలో ఆమె తప్పిదం చేశారనే చర్చ నడుస్తోంది. విశాఖ నుంచి ఆమె బీజేపీ తరుపున పోటీ చేసి ఉంటే ఆమెకు విజయావకాశాలు ఎక్కువ ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో సైతం ఆమె అక్కడ గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు కోసం ఆమె విశాఖ సీటు త్యాగం చేశారు. రాజమండ్రి నుంచి పోటీకి దిగారు.

ఇక్కడ ఎంపీ సీటు విషయంలో బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు వంటి వారి నుంచి ఆమెకు సెగ తగిలింది. టీడీపీ, బీజేపీ నుంచి నారా, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలో ఎక్కువ మంది పోటీ చేశారని బీజేపీలో ఒక వర్గం గుర్రుగా ఉంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఆమె గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ ఓడిపోతే ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవ్వొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి కూడా ఆమెను తీసేయొచ్చు. గత పదేళ్లలో బీజేపీ రాష్ట్రం నుంచి ఎక్కువ మందిని రాజ్యసభకు పంపలేకపోయింది. దీంతో కేవలం పార్టీలో ఒక నాయకురాలిగా మాత్రమే ఆమె కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాజమండ్రిలో గెలుపు పురంధేశ్వరికి ప్రతిష్టాత్మకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: