యూటీగా హైదరాబాద్‌.. కేసీఆర్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది సామెత. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు అంటున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యేఅని ప్రచారం జోరుగా నడుస్తోంది. పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలో కాస్తో.. కూస్తో ఉనికి చాటుకోవడానికి బీఆర్ఎస్ నేతలు మళ్లీ భావోద్వేగ రాజకీయాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. వాస్తవానికి జూన్ 2తో పదేళ్ల   ఉమ్మడి ఏపీ రాజధాని గా హైదరాబాద్ గడువు ముగుస్తుంది.  ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

భావోద్వేగ ప్రకటనలు రెచ్చగొట్టి ద్వారా బీఆర్ఎస్ ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ నినాదం మొదలు పెట్టి.. 2014లో ఇదే భావోద్వేగ అంశాన్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2018లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని.. తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని.. తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనం మళ్లీ మొదలవుతుందని సెంటిమెంట్ రాజేశారు.

ఇప్పుడు ఈ తరహా భావోద్వేగ అంశాలు ఏమీ బీఆర్ఎస్ కు కనిపించడం లేదు. దగ్గర్లో హైదరాబాద్ అనే అంశం ఒకటే ఉంది. అందుకే కేటీఆర్ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దీనికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని.. దీనిని అడ్డుకునే శక్తి ఒక్క బీఆర్ఎస్ కే ఉందని గొప్పలు చెబుతున్నారు. అయితే ఈ భావోద్వేగ ప్రకటనల్లో ప్రజలు చిక్కుతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: