బాబుతో ఇష్టంలేని కాపురం.. కష్టంగా చేస్తున్న బీజేపీ?

ఎట్టకేలకు కూటమి నేతలకు కొంత జోష్ లభించినట్లయింది. బీజేపీ అగ్రనేతలు ఏపీ పర్యటనకు వస్తున్నారు. నెల రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు వచ్చినా జగన్ ని నేరుగా విమర్శించలేదు. దీంతో కూటమి నేతల్లో నైరాశ్యం అలముకొంది. దీనికి తోడు అప్పటి నుంచి బీజేపీ నేతలు ఏపీ పర్యటనకు రాకపోవడం వంటి అంశాలతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

కానీ రాజ్ నాథ్ సింగ్ పర్యటనతో కూటమిలో మళ్లీ జవసత్వాలు వచ్చినట్లయింది. టీడీపీకి కావాల్సిన విధంగా వైసీపీని తీవ్రంగా విమర్శించారు. అవినీతి అక్రమాల పుట్టగా వైసీపీ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. ఏపీలో అప్పు ఎంతో చెప్పారు. ఇది నిజమో అబద్దమో తెలియదు కానీ అక్షరాలా రూ.13.50లక్షల కోట్లు అప్పు ఏపీపై ఉందని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా పోలవరం ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు అని నిలదీశారు.


రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ప్రాజెక్టు ఎప్పుడో పూర్త్యేయ్యేది అని పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీ కీలక నేత పీయూష్ గోయల్ కూడా వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కి తీసుకెళ్ళిందని విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను  వృథా చేశారని పేర్కొన్నారు. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వచ్చి చంద్రబాబు సీఎంగా అయితేనే ఏపీ అభివృద్ధిలో పయనిస్తుందని చెప్పుకొచ్చారు.

ఏపీలో అభివృద్ధి ఎన్డీయే కూటమితోనే సాధ్యం అని పేర్కొన్నారు. మొత్తం మీద బీజేపీ నాయకులు ఏపీకి రావడం లేదని.. వచ్చినా వైసీపీని విమర్శించడం లేదని టీడీపీ పెద్దలకు ఒక దిగులు ఉండేది. ఇప్పుడు రాజ్ నాథ్, పీయూష్ గోయల్ రాకతో ఆ బెంగ తీరిపోయింది. వీరిద్దరూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రానున్న రోజుల్లో మరింత మంది కేంద్ర మంత్రులు ఏపీకి వస్తారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారని.. ఇది కూటమికి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: