కొత్త కేబినెట్‌: దేశంలోనే రికార్డు సృష్టించిన జగన్?

ఏపీ సీఎం జగన్ తన కొత్త జట్టును ఎంపిక చేసుకున్నారు. మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించి.. మళ్లీ ఫ్రెష్‌గా మంత్రులను ఎంపిక చేసుకున్నారు. అయితే.. ఈసారి జగన్ తీసుకున్న మంత్రులను చూస్తే.. ఇది దేశంలోనే ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. బహుశా ఈ రికార్డును మళ్లీ భవిష్యత్‌లో ఎవరైనా అధిగమిస్తారో లేదో కూడా చెప్పలేం.. అలాంటి సంచలమైన నిర్ణయం జగన్ తీసుకున్నారు. మరి అంత సంచలనమైన నిర్ణయం ఏంటో చూద్దామా..?

మన దేశంలో ఎంత కాదన్నా అన్నీ కులాల లెక్కల్లోనే చూస్తుంటారు. అందులోనూ ఏపీ రాజకీయాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది.. ఈ సారి జగన్‌ కేబినెట్‌లో కొన్ని వర్గాలకు అసలు ప్రాతినిథ్యమే దక్కలేదు. ఆ కులాల పేర్లు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. జగన్ కేబినెట్‌లో ఈసారి ఒక్క బ్రాహ్మణుడూ లేడు.. అలాగే జగన్ కేబినెట్‌లో ఈసారి ఒక్క రాజు అంటే క్షత్రియుడు కూడా లేడు.. అలాగే జగన్ కేబినెట్‌లో ఒక్క వైశ్యుడు కూడా లేడు. మను ధర్మ శాస్త్రం ప్రకారం హిందూ చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్రకులాలుగా, ఆధిపత్య కులాలుగా, అధికార కులాలుగా  చెప్పకునే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కకపోవడం విచిత్రమే.

వీటితో పాటు మరో రికార్డు కూడా జగన్ సృష్టించాడు. ఈసారి మంత్రి వర్గంలో ఒక్క కమ్మ ఎమ్మెల్యే కు కూడా స్థానం దక్కలేదు. అసలు ఏపీ రాజకీయాల్లో ఒక్క కమ్మ మంత్రి కూడా కేబినెట్‌లో లేకుండా పోవడం గత మూడు, నాలుగు దశాబ్దాలలో ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. తెలుగు దేశం అధికారంలో ఉన్నప్పుడు కమ్మల రాజ్యం కొనసాగేది.. పెద్ద సంఖ్యలో కమ్మలు మంత్రులుగా ఉండేవారు. ఇప్పుడు జగన్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మ కోటా కింద కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు.

రెండో విడతలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. మొత్తానికి జగన్ కేబినెట్‌లో దాదాపు 70 శాతం వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని సజ్జల ప్రకటించారు. అదే నిజమైతే.. ఇది నిజంగా విప్లవాత్మక నిర్ణయంగానే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: