షర్మిల చూపు ఏపీ వైపు? తెలంగాణ ఐపోయిందా?
ఈ పరిణామాలను బట్టి చూస్తే షర్మిల ఏపీలోనూ పార్టీ పెట్టాలని భావిస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదే నిజమైతే.. ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే షర్మిల వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అంటూ పార్టీ పెట్టారు.. ఆ పార్టీ తెలంగాణకే పరిమితం అని పార్టీ పేరులోనే ఉంది. అందువల్ల ఆ పార్టీతో వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టలేరు.. మరి ఏపీలో రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే కొత్త పార్టీ పెట్టాలి.. కానీ.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టిన పార్టీకే పెద్దగా ఆదరణ లేదు. అలాంటిది అప్పుడే మళ్లీ ఏపీలో ఇంకో పార్టీ పెడతారా అన్న అనుమానం రాక మానదు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా చెప్పుకోదగ్గ విజయం ఏమీ ఇప్పటివరకూ సాధించలేదు. ఆమె పార్టీ పెట్టే ముందే అన్నీ ఆలోచించుకుని ఏపీ వద్దనుకుని తెలంగాణలో పార్టీ పెట్టారని అప్పట్లో విజయమ్మ చెప్పుకొచ్చారు. ఏపీలో అన్న జగన్‌కు పోటీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె తెలంగాణను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీని ఏం చేస్తారు.. ఒకేసారి ఆమె తెలంగాణలోనూ.. ఏపీలోనూ రెండు పార్టీలు నడిపిస్తారా.. అది సాధ్యమయ్యే పనేనా.. ఒకవేళ ఏపీలోకే అడుగు పెట్టదలచుకుంటే... తెలంగాణలో పార్టీని మూసేస్తారా.. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. ఆలూ లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు షర్మిల ఏపీలో పార్టీ పెడుతుందన్న దానికే ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. అందువల్ల ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే.. ఇంకొంత సమయం పడుతుంది.