ఏపీలో ఆ రెండు కులాల మధ్య యుద్ధం.. ఎటు దారి తీస్తుంది..?

ఏపీ రాజకీయం అంతా కులాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ విషయం బహిరంగ రహస్యమే. ప్రధానంగా రెడ్డి, కమ్మ కులాల మధ్య కొన్నేళ్లుగా పోరు సాగుతూనే ఉంది. అధికారం కోసం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య యుద్ధం సాగుతోంది. ఈ రెండు కులాలతో పాటు ఏపీలో కాపు, రాజు సామాజిక వర్గాలు కూడా రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉన్నవి.. కీలకమైనవి. అయితే ఇప్పుడు తాజాగా రెడ్డి, రాజు వర్గాల మధ్య యుద్ధం రాజుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

ఇటీవల ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరుగా బాగా నానుతున్న సంగతి తెలిసిందే. జగన్ పార్టీ ద్వారానే ఎంపీగా గెలిచిన ఆయన కొంతకాలంగా జగన్‌ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విబేధాల నేపథ్యంలో ఆయన్ను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం.. ఆయన పాదాలకు గాయాలు కావడం.. విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరింతగా డోసు పెంచారు.

ఈ లోపు  మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు తొలగింపు విషయంలో జగన్ సర్కారుకు చుక్కెదురైంది. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజునే కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అశోక్‌ గజపతిపై విమర్శల డోసు పెంచారు. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా అశోక్‌ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఏకంగా జైలుకు పంపుతామని కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రాజుకుంది. తెలుగు రాష్ట్రాల క్షత్రియ సమాజం పేరుతో విజయసాయి వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంతో ఇప్పుడు ఏపీలో రెడ్డి, రాజు కులాల మధ్య ఘర్షణ వైఖరి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇది కేవలం అశోక్‌, రఘురామ కృష్ణం రాజుల వరకే పరిమితం అవుతుందని.. రాజు సామాజిక వర్గం వారంతా ఈ పరిణామాలపై ఆగ్రహం లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారి  తీస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: