పాపం.. ట్రంప్ ఆశలు గల్లంతేనా..? జో బైడెన్‌ కే ఛాన్స్..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధ్యక్షుడు ట్రంప్‌లో గెలుపు ఆశలు ఆవిరవుతున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ ఆయన వెనుకబడుతున్నారు. ట్రంప్ ప్రత్యర్థి.. డెమోక్రట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ అంత ఆకర్షణీయమైన నాయకుడు కాకపోయినా ఈ ట్రంప్ కంటే ఎవడైనా పర్లేదురా బాబో అన్నట్టుగా ఉంది అమెరికా పౌరుల అభిప్రాయం. మరోసారి ట్రంప్‌ను కొనసాగించాలన్న ఉద్దేశం సగటు అమెరికన్లలో కనిపించడం లేదని అనేక సర్వేలు చెబుతున్నాయి.

ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కోఆపరేటివ్‌ ఎలక్షన్‌ స్టడీ పేరుతో నిర్వహించిన సర్వేలోనూ ఇదే తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ వైపు మొగ్గుచూపారు. ట్రంప్ మరోసారి వద్దు బాబో అంటున్నారు. ఇక 43 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు పలికారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. బైడెన్‌ మద్దతుదారుల్లో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. 18-44 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా బైడెన్‌వైపు మొగ్గు చూపుతున్నారు.

65 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రం ట్రంప్‌ వైపు మొగ్గుచూపారు. ఇక అమెరికాలోని వివిధ వర్గాల వారీగా సర్వే ఫలితాలు చూస్తే.. ఆసియా అమెరికన్లలో 65 శాతం మంది బైడెన్‌ వైపు నిలిచారు. ట్రంప్‌నకు ఈ వర్గంలో కేవలం 28 శాతం మంది మాత్రమేమద్దతు  పలికారు. ఇక నల్లజాతీయుల్లో ట్రంప్‌పై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. బ్లాక్స్ లో కేవలం 9 శాతం మంది మాత్రమే ట్రంప్‌ కు ఓటేస్తామన్నారు.

నల్లజాతీయుల్లో 86 శాతం బైడెన్‌కే ఓటేస్తామంటున్నారు. ఇక వైట్స్‌లో అతిస్వల్ప తేడాతో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ట్రంప్‌నకు 49 శాతం మంది మద్దతుగా ఉంటే.. 45 శాతం మంది బైడెన్‌ వైపు మొగ్గు చూపారు. మహిళల్లో బైడెన్‌కు 55 శాతం, ట్రంప్‌నకు 39 శాతం మంది మద్దతుగా ఉన్నారు. పురుష ఓటర్లలో ఇద్దరు అభ్యర్థులకూ దాదాపు సమాన మద్దతు లభించింది. మొత్తానికి ట్రెండ్‌ చూస్తే.. ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: