హెరాల్డ్ ఎడిటోరియల్ : కొత్త కమిటిలపై నేతల్లో అప్పుడే అసంతృప్తా ?

Vijaya
చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రకటించిన రెండు కమిటిలపై నేతల్లో అప్పుడే అసంతృప్తి మొదలైనట్లే అనిపిస్తోంది. కేంద్రకమిటి, పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న నేతలనను గమనిస్తే చంద్రబాబులో ఏ స్ధాయిలో అయోమయం చోటు చేసుకుందో అర్ధమైపోతోంది. పార్టీలో సీరియస్ గా పనిచేస్తున్నవారిలో కొందరికి చోటు దక్కలేదు. ఇదే సమయంలో పార్టీని వదిలిపోతారని ప్రచారం జరుగుతున్న వారికి, పదవులు వద్దని రాజీనామా చేసిన వారికి బలవంతంగా   మళ్ళీ పదవులు కట్టబెట్టడం విచిత్రంగా ఉంది. కమిటిలో చోటు దక్కని వారిలో ఉరవకొండ ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ పేరుండటమే ఆశ్చర్యంగా ఉంది. అలాగే ప్రకాశం జిల్లాలోని ఎంఎల్ఏల పేర్లు కూడా ఎక్కడా కనబడలేదు. ఇదే సమయంలో పార్టీ నుండి వెళ్ళిపోతారని ప్రచారంలో ఉన్న కొందరు నేతలను ఉపాధ్యక్షులుగా నియమించటం ఆశ్చర్యంగా ఉంది.



ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ప్రతిభాభారతి టీడీపీని వదిలేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. అలాంటి ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇక చిత్తూరు మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ కూడా ఏదో రోజు పార్టీని వదిలిపెట్టడం ఖాయమని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎలాగంటే ఈమధ్య తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినపుడు సత్యప్రభ కొడుకు డీకే శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. దాంతో డీకే కుటుంబం టీడీపీని వదిలేయటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.  ఇదే సమయంలో తనకు పార్టీలో ఏ పదవులు వద్దని పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి ఈమధ్యనే రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఇపుడు జాతీయ ఉపాద్యక్షురాలిగా మళ్ళీ అరుణకుమారిని ఎందుకు నియమించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. వయోభారం కారణంగా తనకు పదవులు వద్దని ఆమె తన రాజీనామా లేఖలో స్పష్టంగా చెప్పారు.



ఇక గుంటూరు ఎంపి, లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్, అరుణకుమారి కొడుకు అయిన గల్లా జయదేవ్ ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. విచిత్రమేమిటంటే జయదేవ్ ఇప్పటికే లోక్ సభలో ఫ్లోర్ లీడర్ హోదాలో పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉండటం. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్న కోట్ల సూర్యప్రకాషరెడ్డి లాంటి వాళ్ళను కూడా ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు.  మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించన మాజీ ఉపముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. కేఇ కుటుంబం కూడా వైసీపీలో చేరిపోవటం ఖాయమని ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.  ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విశాఖ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణకు కూడా ఏ కమిటిలోను చోటు దక్కలేదు.



అంటే తాజాగా ఏర్పాటయిన  కమిటిని చూస్తుంటే చంద్రబాబులో అయోమయం ఎంతగా చోటు చేసుకున్నదో అర్ధమైపోతోంది. కమిటిలోకి ఎవరిని తీసుకోవాలి ? ఎవరిని దూరంగా పెట్టాలి ? అనే విషయంలో చంద్రబాబుకు క్లారిటి మిస్సయిన విషయం అర్ధమైపోతోంది. ఎందుకంటే పార్టీలో అసలు ఎవరుంటారు ? ఎవరుండరు ? అనే విషయంలోనే పూర్తిగా అయోమయం కనబడుతోంది. ఈ పరిస్ధితుల్లో  ఎవరినో ఒకరిని వేయాలి కాబట్టే వేసినట్లుంది. ఈమాత్రం దానికి ఇన్ని నెలలుగా కసరత్తులు చేయటం దేనికో అర్ధం కావటం లేదు. అసలు రాష్ట్ర అధ్యక్షపదవి విషయంలోనే మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంఎల్సీ బీద రవిచంద్రయాదవ్ ల్లో ఎవరికివ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోయారు. మొత్తం మీద కమిటిలో చోటు దక్కిన నేతలు కొందరిలో అప్పుడే అసంతృప్తి  కనబడుతోంది. మరి బాధ్యతలు తీసుకునేదెవరు ? నిరాకరించేదెవరో తొందరలోనే తేలిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: