హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇద్దరి పైనా సిబిఐ కేసులా ? జగన్ సంచలనం
అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో 4077 ఎకరాలను చంద్రబాబు+మద్దతుదారులు+టిడిపి సీనియర్ నేతలు కాజేపశారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వైసిపి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించాడు. అప్పుడు చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ముందు మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించాడు. సేకరించిన ఆధారాలతో సిట్ తో పాటు ఈడితో కూడా విచారణ చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో సిట్+ఈడి తమ విచారణ ప్రారంభించాయి.
ఈ దశలోనే తమపై జరుగుతున్న సిట్ విచారణను నిలిపేయాలంటూ టిడిపి సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసులు వేశారు. వైసిపి ఆరోపణలు చేసినపుడేమో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమంటూ తండ్రి, కొడుకులతో పాటు యావత్ టిడిపి నేతలు ప్రభుత్వాన్ని సవాలు చేశారు. తమపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతోందంటూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. తీరా సిట్ తో విచారణ చేయించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యేటప్పటికి మరి టిడిపి నేతలు కోర్టులో కేసులు ఎందుకు వేశారో అర్ధం కావటం లేదు. తమలో ఎటువంటి తప్పులు లేనపుడు, తాము అవినీతికి పాల్పడనపుడు సిట్ విచారణకు సహకరించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం వాళ్ళకే మంచిది కదా?
సిట్ విచారణ జరిపే విషయంలో హైకోర్టు ఏమంటుందో చూడాలి. ఇదే సమయంలో సిబిఐ విచారణ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది. ఈ విషయమే ఇంకా తేలలేదంటే తాజాగా ఫైబర్ నెట్ లో జరిగిన కుంభకోణం విచారణను కూడా సిబిఐకే ఇవ్వటమే గమనార్హం. తండ్రి, కొడుకుల మీద అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ చేయటం అనే అంశం ఇపుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. జగన్ సిఫారసుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి గనుక సానుకూలంగా స్పందిస్తే ఏపి రాజకీయాల్లో సంచలనం మొదలైనట్లే. సిబిఐ రంగంలోకి దిగాలి, విచారణ మొదలుపెట్టాలి, ఆరోపణలు నిరూపితం కావాలి అప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.