ఎడిటోరియల్ : 'కమల' తో పవన్ ప్రయాణం ఎలా ఉంది ? గతుకులు అతుకులేనా ?

పొత్తు పెట్టుకున్నారు అన్న పేరు కే గాని, పవన్ ను, జనసేనను బిజెపి పట్టించుకుంటుందా అంటే పట్టించుకోదు. అలా అని వదిలేస్తుందా అంటే వదలదు. అసలు జనసేన తో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలనే విషయంలో బీజేపీకి ఏ క్లారిటీ లేదు. అలాగే పవన్ కూడా తమతో పొత్తు పెట్టుకున్నారు కానీ ఫలితం ఏమిటి అనేది బీజేపీ ప్రశ్న?. మిత్రపక్షంగా తనను ఎందుకు గుర్తించడం లేదు ?
 కేంద్ర బిజెపి నాయకుల అపాయింట్మెంట్ తనకు రాకుండా ఎందుకు అవమానిస్తున్నారు ? . ఏపీలో రాజకీయంగా ముందుకు వెళ్లే విషయంలో తనను ఎందుకు కలుపుకు వెళ్లడం లేదు ? మిత్రపక్షంగా మీరు ఉన్నా తనకు ఉపయోగం ఏంటి ? ఇలా గట్టిగా నిలదీసి అడిగే ప్రయత్నం పవన్ చేయలేకపోతున్నారు. 


జనసేనతోనే కాదు ఏపీ అధికార పార్టీ వైసీపీతోనూ బిజెపి మైండ్ గేమ్ ఆడుతోంది. కేంద్రంలో బిజెపితో  సఖ్యతగా ఉన్నట్టుగా వ్యవహరిస్తుంటే, ఏపీ బిజెపి నాయకులు వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉండగానే పవన్ తో బిజెపి ఆడుతున్న మైండ్ గేమ్ జనసైనికులకు నచ్చడంలేదు. ఏపీ బిజెపి నాయకులు మాత్రం పవన్ తమ మిత్రుడని, జనసేన తమ మిత్ర పక్షం అంటూ చెబుతూ వస్తున్నా, బీజేపీ పెద్దలు మాత్రం పవన్ ను అస్సలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024 నాటికి ఏపీలో అధికారం చేపట్టాలని బిజెపి తహతహలాడుతోంది. 


ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని, వైసీపీకి ఆ సమయానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు అని, పవన్ సహకారంతో తామే అధికార పీఠం దక్కించుకుంటామని ఇలా ఎన్నో ఆశలు పెట్టుకుంది బిజెపి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీని బలోపేతం చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు ఏవి చేయలేకపోతోంది. అసలు ఏపీ బిజెపి నాయకులను సమన్వయం కొరవడిందని, గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు ఎప్పుడో బీజేపీ అధిష్టానానికి అందాయి. కొద్ది రోజుల క్రితమే ఈ గ్రూపు రాజకీయాల వ్యవహారంపై దృష్టి బీజేపీ అధిష్టానం ద్రుష్టి పెట్టింది. 


అందరూ ఒకే మాట మీద ఉండాలి అని, ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లుగా స్టేట్మెంట్స్ ఇస్తే కుదరదని, ఎవరైనా ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే హైకమాండ్ ను సంప్రదించాలని ఇలా గట్టిగానే వార్నింగ్ ఇవ్వడమే కాకుండా, పార్టీ క్రమశిక్షణ తప్పిన కొంతమందికి వార్నింగ్, మరికొంతమందికి సస్పెన్షన్బ బహుమతిగా ఇచ్చింది. బిజెపి దూకుడు గానే ముందుకు వెళుతోంది. కానీ తన మిత్రపక్షమైన జనసేన ను పక్కన పెట్టినట్టుగానే వ్యవహరిస్తూ వస్తుండడం జనసేన నాయకులకు మింగుడు పడడం లేదు. అసలు బిజెపికి క్షేత్రస్థాయిలో బలమే లేదని, జనసేన నాయకులు ఎప్పటి నుంచో పవన్ కి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉందని, కాకపోతే నాయకత్వ లోపం ఉందని చెబుతున్నాయి.


 బీజేపీకి నాయకులు ఉన్నా, క్షేత్రస్థాయిలో బలం లేదని, మీరు దృష్టి పెడితే ఏపీలో బలమైన పార్టీగా జనసేన తయారవుతుందని సూచిస్తున్నారు. కానీ బీజేపీ సహకారం ఉంటే తప్ప 2024 ఎన్నికల నాటికి అధికారంలోకి రాలేమని ఖచ్చితంగా బీజేపీతో పొత్తు ఉండాల్సిందేనని పవన్ ఇప్పటికీ  నమ్ముతున్నారు. ఆర్థికంగా, ఐడియాలజీ ప్రకారం చూసుకున్నా, బిజెపి సపోర్టు లేనిదే బలమైన తెలుగుదేశం, వైసీపీ ని   ఎదుర్కోలేమని పవన్ భావిస్తున్నారు. పవన్ ఆలోచన ఇలా ఉంటే బీజేపీ మాత్రం జనసేన మద్దతు తమకు కావాలి కానీ, క్రెడిట్ అంతా బిజెపికే దక్కాలి తప్ప మరెవరికీ దక్కకూడదనే ఆలోచనలో ఉన్నట్టు గా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో రెండు పార్టీల నాయకుల లోనూ స్పష్టత కరువవడంతో, క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నాయకులు గందరగోళానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: