బ్యాంకుల్లో వృద్ధుల పెన్షన్ల సొమ్ము.. టీడీపీకి చుక్కలేనా?

వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకున్న టీడీపీ అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది. గత నెలలో పెన్షన్లు సచివాలయాల్లో అందజేయగా.. ఎండాకాలంలో వాటిని అందుకోలేక వృద్ధులు నానా ఇబ్బందులు పడ్డారు. చక్కగా ఇంటి వద్ద పెన్షన్లు అందుకే తమను ఇలా ఇబ్బంది పెట్టారని  టీడీపీని తిట్టుకున్నారు. ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని  కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ విధానంలో నగదు బదిలీ లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పింది.

లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గతంలో జారీ చేసిన ఆదేశాల స్పూర్తిని తీసుకోవాలని సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా పెన్షన్ లబ్దిదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల దృష్ట్యా  2024 మే, జూన్ మాసాలకు గానూ ఆధార్ కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. మొత్తం 65,49,864 మంది పెన్షన్ లబ్దిదారుల్లో 74 శాతం మందికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ వ్యవస్థ ద్వారా పెన్షన్ జమ చేస్తారు.

48,92,503 మంది పెన్షన్ లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ మ్యాపింగ్ అయి ఉంది. మే 1 తేదీన ఈ లబ్దిదారులందరికీ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తారు. మొబైల్ లింకు అయిన లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా పెన్షన్ జమ అయినట్టుగా సంక్షిప్త సందేశం వస్తుంది. దివ్యాంగులు, ఆనారోగ్యంతో మంచానపడిన వారు, వీల్ చైర్ లకు పరిమితం అయిన వారు, మాజీ సైనికుల వితంతువులతో పాటు బ్యాంకు ఖాతా లేని వారికి ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేస్తారు.

ఈ కేటగిరీల్లో 16,57,361  మంది పెన్షన్లర్లకు ఇంటింటికీ పంపిణీ చేస్తారు. మొత్తం పెన్షనర్లలో 25.30 శాతం మందికి ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేస్తారు. మే 1 తేదీ నుంచి మే 5 తేదీ వరకూ పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లను ఆదేశించామని పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇలా కావడం టీడీపీకి చుక్కలు చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: