డిజిటల్ దిశగా పోస్టాఫీసులు.. అందుబాటులో మరిన్ని లావాదేవీలు..!

Podili Ravindranath
ప్రపంచం డిజిటలీకరణ దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు అన్ని రకాల సేవలు కూడా కంప్యూటరీకరణ అవుతున్నాయి. ఇప్పటికే ఆన్ని రకాల పౌర సేవలు కూడా ప్రభుత్వం ఆన్ లైన్ విధానం ద్వారా అందిస్తోంది. ఇందులో భాగంగా పోస్టాఫీసులు కూడా ప్రస్తుతం వేగంగా ఆధునీకరిస్తున్నారు. మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల వరకు కూడా తపాలా శాఖ ఆధునీకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసులను కూడా ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి సర్వ సేవా కేంద్రాలుగా మార్చేందుకు తపాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. తపాలా సేవలతో పాటు మొత్తం 34 రకాల ఆన్ లౌన్ పౌరసేవలు కూడా ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని పోస్టాఫీసుల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1,568 పోస్టాఫీసులను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చేశారు కూడా. మరో 8,504 పోస్టాఫీసులను రానున్న రెండు నెలల్లో సీఎస్సీలుగా మార్చేందుకు తపాలా శాఖ సిద్ధమైంది.
ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో కూడా పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ కార్డు, మొబైల్ రీచార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్టీఏ, డీటీహెచ్ సేవలు, విద్యుత్, నీటి బిల్లులు, గ్యాస్ కనెక్షన్లకు అప్లికేషన్, వాహనాల ఫాస్ట్ టాగ్ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్ల బుకింగ్, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ అత్మ నిర్భర్ భారత్ నిధి యోజన, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్ ధన్ యోజన్ వంటి పథకాలకు సంబంధించిన ధరఖాస్తులు, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులకు సంబంధించిన వివరాలు కూడా ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయి శిక్షణ పొందిన సిబ్బంది కూడా ప్రస్తుతం సర్వీసు చేస్తున్నారు. దీనిని అనుకూలంగా మలుచుకుంటున్న తపాలా శాఖ... అన్ని గ్రామాలకు ఆన్ లైన్ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎస్సీల్లో అందించే సేవలపై రాష్ట్రంలోని నాలుగు వేల మంది సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహించారు. ఇప్పటికే సీఎస్సీ సర్వీసు అందుబాటులో ఉన్న పోస్టాఫీసుల్లో కోటీ 30 లక్షల రూపాయల విలువైన 12 వేల లావాదేవీలు నిర్వహించారు కూడా. సీఎస్సీ సర్వీసు ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కూడా తపాలా శాఖ సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: