జుట్టు సంరక్షణకు వంటింటి చిట్కాలు...!

MADDIBOINA AJAY KUMAR
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. అందులో స్త్రీలకు కొంచెం ఎక్కువ శ్రద్ధ. అయితే నేటి పరిస్థితుల్లో అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువయ్యాయనే చెప్పాలి. పెరుగుతున్న కాలుష్యం, రేడియేషన్, ఆహార విధానాల వల్ల కూడా జుట్టు ఊడటం, చిట్లడం,తెల్లబడటం వంటి సమస్యలు తలెత్తున్నాయి. అయితే ఈ సమస్య కోసం ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే పరిష్కరించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
1. మిరియాలు మెత్తగా నూరి జుట్టు ఊడిన చోట రుద్దితే వెంట్రుకల కుదుళ్లు గట్టి పడి తిరిగి పెరగటం మొదలవుతుంది.
2. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించాలి. ఆ నూనె చల్లారాక వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఈ నూనె కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు తెల్ల పడకుండా ఉంటుంది.
3. పసుపు, మాను పసుపు (పచ్చి పసుపు) కలిపి పొడి చేసి ఆ పొడిని వెన్నతో ముద్దగా నూరి తలకు పట్టించి గంట సేపు ఆగిన తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది.
4. మినుములు, ఉసిరికాయ బెరడు, సీకాయ, మెంతులను పొడిగా నూరాలి. తర్వాత అర గ్లాసు నీళ్లలో రెండు స్పూన్ల పొడిని వేసి కలపాలి. ఆ నీటిని  హెయిర్ ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. గుప్పెడు మందార ఆకులు, నాలుగు స్పూన్ల పెరుగు కలిపి నూరి తలకు పట్టించి  తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు   నల్లబడుతుంది.
6. ఇవే కాక మన పెరట్లో ఉండే మందార చెట్టు ఆకులు, పువ్వులు కూడా జుట్టుకి బాగా ఉపయోగపడతాయి. ఏడెనిమిది మందార పువ్వులను మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది.
7. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హెన్నా కానీ లేదా గోరింటాకు నూరి కానీ హెయిర్ ప్యాక్ లా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: