ఉండ్రాళ్ళు ఇంత సింపుల్ గా చేయచ్చా...!!!!

NCR

వినాయక చవితి వచ్చేస్తోంది. బొజ్జ గణపయ్య పండుగ కోసం ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. ఒక రోజు ముందే మట్టిని తెచ్చి బాగా నానబెట్టి తమకి వచ్చిన విధంగా వినాయకుని ప్రతిమని తీర్చి దిద్దుకుని పూజ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే వినాయకుడు బొజ్జ నిండా తినడానికి ఎన్నో రకాల పలహారాలు కూడా చేసి ఆరగింపు పెడుతారు. ఎన్ని పదార్ధాలు చేసినా వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసేది, వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఉండ్రాళ్ళే..

 

మరి ఈ ఉండ్రాళ్ళు చేయడం ఎలా, ఎలా పడితే అలా చేసేయడం కాదు, బొజ్జ గణపతికి ఇష్టంగా ఉండేలా చేయగలగాలి. ఎంతో రుచిగా ఉండ్రాళ్ళు చేయడం అది కూడా ముందుగా రుచి చూడకుండా చేయడం అంటే ఎంతో కష్టమే. అందుకే చాలా సింపుల్ గా ఉండ్రాళ్ళు ఎలా చేయచ్చో ఇప్పుడు చూద్దాం..

 

ఉండ్రాళ్ళు చేయడానికి కావాల్సిన పదార్ధాలు : 

బియ్యం రవ్వ – అర కప్పు

శనగపప్పు   - చెంచాడు

నెయ్యి   -  ఒక చెంచాడు

ఉప్పు  - అరస్పూన్ లో సగం ( పావు స్పూన్ )

 

గమనిక : ఈ కొలతలు ఉపయోగించి మీరు పెద్ద మొత్తంలో చేసుకోవాలన్నా సరే అంచనా వేసి చేసుకోవచ్చు.

 

ముందుగా శనగపప్పు లో నీళ్ళు పోసి సుమారు అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని ఎండబెట్టి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కొంచం నెయ్యి పోసుకోవాలి. పక్కకి పెట్టుకున్న శనగపప్పు ని నెయ్యి లో వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి బాగా మరిగించాలి. నీళ్ళు మరుగుతున్న  సమయంలోనే ఉప్పు, బియ్యపు రవ్వ వేసుకుని రవ్వ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. చల్లారిన తరువాత ఉండలుగా చుట్టుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. తరువాత వెంటనే బొజ్జ గణపతికి నైవేద్యం పెట్టేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: