విజయం మీదే : లక్ష్య సాధనలో అవరోధాలను అధిగమిస్తే సులువుగా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
ప్రపంచంలోని ప్రతి మనిషి తాను ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని అనుకుంటూ ఉంటాడు. కానీ వారిలో కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి సక్సెస్ అవుతారు. చాలామంది లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాల వల్ల సక్సెస్ సాధించలేరు. సాధించే సత్తా ఉన్నా భయం, బద్ధకం వల్ల సక్సెస్ కు దూరమవుతారు. లక్ష్యం గురించి ఆలోచించే వాళ్లు అవరోధాలను దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధిస్తే విజయం సొంతమవుతుంది.
 
లక్ష్యాన్ని సాధించడం సులభమని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే ఇబ్బందులు మనకు అర్థమవుతాయి. లక్ష్య సాధనకు అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులు అవరోధాలుగా మారుతాయి. అయితే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగిపోకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం సొంతమవుతుంది.
 
సక్సెస్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందడుగులు వేయాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఆహ్వానించి ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఒక అవరోధం తొలగిపోగానే పొంగిపోకుండా లక్ష్యసాధనకు ఇబ్బంది పెట్టడానికి మరిన్ని అవరోధాలు సిద్ధంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే సులభంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది.
 
సక్సెస్ సాధించాలంటే లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని పటిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. సమర్థ ఆచరణే మనల్ని గమ్యస్థానం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. అసమర్థత కారణంగా మనల్ని మనం నిందించుకోకూడదు. మానసిక శక్తిని పెంచుకుని విజయం వైపుగా అడుగులు వేయాలి. కాలయాపన చేయకుండా బాధ్యతగా నిజాయితీతో లక్ష్య సాధనకు కృషిచేయాలి. చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూడకుండా సర్దుబాటు ధోరణిని అలవరుచుకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు సులభంగా చేరుకోగలుగుతాం. ఎదుటివారు చెప్పే దానిలో వాస్తవం ఉంటే అంగీకరించాలి. గెలుపు, ఓటమి జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరికీ సమాన సామర్థ్యాలుంటాయి. వాటిని ఏ స్థాయిలో వినియోగించుకున్నారన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: