పట్టపగలు నడిరోడ్డుపై షాకింగ్ ఘటన.. సినిమాల్లోనే ఇలాంటివి చూసి ఉంటారు?

praveen

ఈ రోజుల్లో మహిళలపై పట్ట పగలే అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వారికి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా భద్రత లేకుండా పోతోంది. రాజస్థాన్‌లోని బలోత్ర జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పాడుతోంది. ఆమెను సొంత కుటుంబ సభ్యులే అపహరించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబం ఈ చర్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మహిళ తల్లిదండ్రులుతో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల ప్రకారం, ఆ మహిళ, ఆమె భర్త, కొంతమంది కుటుంబ సభ్యులు ఆటోలో దేవాలయానికి వెళ్తున్నారు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, బంధువులు మరో వాహనంలో వచ్చి ఆటోను ఆపి, ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక వ్యక్తి రహస్యంగా రాజస్థాన్‌ పోలీసులకు ఈ అపహరణ గురించి వెంటనే సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల సరిహద్దు దగ్గర ఉన్న సిరోహీ జిల్లాలో వారు ప్రయాణిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. అక్కడే వాళ్ళకు ఆ మహిళను తీసుకెళ్తున్న కారు కనిపించింది. వెంటనే ఆ కారును ఆపి ఆ మహిళను కాపాడారు.
బలోత్ర జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారి కుందన్‌ కాన్వాయియా మాట్లాడుతూ, ఆ మహిళ తండ్రి, తల్లితో సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఆ మహిళను తీసుకెళ్లడానికి వాడిన మూడు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుందన్ కాన్వాయియా మాట్లాడుతూ, ఈ దంపతులు ముందుగానే పోలీసులను సంప్రదించి రక్షణ కోరారని, వారికి రక్షణ కూడా అందించామని తెలిపారు. అనుమానాస్పదమైన ఏదైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని, తమ రాకపోకల గురించి కూడా తెలియజేయాలని పోలీసులు వారికి సూచించారని చెప్పారు. అయితే ఈసారి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దేవాలయానికి వెళ్లారు. ఏ రక్షణ లేకుండా వీరు తప్పు చేశారని పోలీసులు అన్నారు. పోలీసులు ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: