'నోటా'కి నో అంటున్న జనం.. కారణం ఇదే?
ప్రజలు నోటా కి నో చెబుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వెలువడిన మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నోటాకు పడిన ఓట్లు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో కేవలం 1.32 శాతం మాత్రమే నోటాకు ఓట్లు పుట్టారు. ఇక ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, కేవలం 4.85 లక్షల మంది ఓటర్లు లేదా మొత్తం ఓటర్లలో 0.8% మంది మాత్రమే నన్ ఆఫ్ ది ఎబవ్ (NOTA) ఎంపికను ఎంచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 40% తగ్గుదల, అప్పుడు ఇదే రాష్ట్రంలో 7.5 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 4.36 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. రాయ్‌గఢ్ నియోజకవర్గం అత్యధికంగా 27,000 నోటా ఓట్లను నమోదు చేయగా, పాల్ఘర్ 23,000తో రెండో స్థానంలో ఉంది.
రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థులపైనే ఓటర్లు ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారని ఈ తగ్గుదల చెప్పకనే చెబుతోంది. అంతేకాదు నోటా కి వేయడం వల్ల తమ ఓటు వృధా అయిపోతుందని కూడా జనాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఓటుకు నోటు తీసుకునే వారు కూడా నోటా కి వేయడం వల్ల మోసం చేసినట్లు అవుతుందని ఎవరికో ఒకరికి ఓట్లు గుద్దేస్తున్నారు. ఎన్నికల సంఘం (EC) ప్రకారం, మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా వరకు ఒక్కొక్కటి 1,000 నోటా ఓట్లు మాత్రమే పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత 2013లో నోటా ఎంపికను ప్రవేశపెట్టారు. ఇది చివరి ఆప్షన్‌గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై (EVMs) కనిపిస్తుంది, బ్లాక్ క్రాస్తో బ్యాలెట్ పేపర్ చిహ్నం ద్వారా సూచించబడుతుంది. దీనికి ముందు, ఏ అభ్యర్థిని ఎంపిక చేయకూడదనుకునే ఓటర్లు తమ నిర్ణయాన్ని నమోదు చేయడానికి ఫామ్ 49-ఓని ఉపయోగించారు.
ముంబైలో, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 72,439 నోటా ఓట్లు పోలయ్యాయి, మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 2% ఓట్లు వచ్చాయి. అనుశక్తి నగర్లో అత్యధికంగా 3,884 నోటా ఓట్లు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ncp అభ్యర్థి సనా మాలిక్, ఎన్‌సిపి (ఎస్పి)కి చెందిన ఫహద్ అహ్మద్, ఎంఎన్ఎస్కు చెందిన నవీన్ ఆచార్య మధ్య గట్టి పోటీ నెలకొంది. మాలిక్ 3,378 ఓట్లతో విజయం సాధించారు. ముంబదేవి నియోజకవర్గం ముంబైలో 988 ఓట్లతో అతి తక్కువ నోటా ఓట్లను రికార్డు చేసింది. అక్కడ శివసేనకు చెందిన షైన ఎన్సీపై కాంగ్రెస్ అభ్యర్థి అమీన్ పటేల్ విజయం సాధించారు.