"అయితే ఓకే.." డైలాగుతో తెలుగువారిని నవ్వించిన కొండవలస.. చివరిలో మాత్రం ఏడిపించేసాడు..?

praveen
* టాలీవుడ్ టాప్ కమెడియన్ కొండవలస మాట తీరే వేరు
* సింగిల్ డైలాగ్ తో టాలీవుడ్ లో సూపర్ పాపులర్  
* సినిమాల్లో నవ్వించి నిజ జీవితంలో ఏడిపించాడు  
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లకు కొదవలేదు. బ్రహ్మానందం, బాబు మోహన్, వేణుమాధవ్ లాంటి దిగ్గజ కమెడియన్లు మనల్ని ఎంతగానో అలరించారు. అయితే సినిమాల్లో ఎంతగానో నవ్వించిన కొందరు కమెడియన్లు మాత్రం నిజజీవితంలో ఏడిపించేశారు. వారిలో కొండవలస లక్ష్మణరావు ఒకరు. "అయితే ఓకే.." అంటూ వెండితెరపై నవ్వులు పూయించారు ఈ కమెడియన్. వైవిధ్యమైన మాటతీరుతో తనదైన కామెడీ స్టైల్ తో తెలుగువారి పొట్ట చక్కలయ్యేలా నవ్వించిన ఈయన చివరి దశలో మాత్రం బాగా ఏడిపించారు. శ్రీకాకుళం లో పుట్టి పెరిగిన కొండవలస సినిమాల్లోకి రాకముందు రంగస్థలంలో నాటకాలు వేస్తూ పాపులర్ అయ్యారు. నాటకాల రాయుడుగా కూడా బిరుదు తెచ్చుకున్నారు.
వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు కొండవలస లక్ష్మణరావు. ఈ హాస్య నటుడు ఈ సినిమాలో "అయితే ఓకే" అంటూ చాలా ఫన్నీగా ఓ డైలాగ్ చెబుతూ ప్రేక్షకుల కళ్ల వెంట నీళ్లు తిరిగేలాగా నవ్వించారు. ఉత్తరాంధ్ర మాట తీరుతో ప్రేక్షకులకు తెగ నచ్చేసారు. కబడ్డీ కబడ్డీ, ఒట్టేసి చెబుతున్నా, ఆనందమానందమాయే, ఎవడి గోల వాడిది, నాయుడమ్మ, అత్తిలి సత్తిబాబు LKG,  బ్లేడ్ బాబ్జి, కుబేరులు, దొంగల బండి, బెండ్ అప్పారావు ఆర్ఎంపీ వంటి ఎన్నో కామెడీ సినిమాల్లో వైవిద్య భరితమైన పాత్రలు పోషించి అలరించారు.
ఆయన నటించిన లాస్ట్ సినిమా జేమ్స్ బాండ్. ఇది 2015, జులైలో రిలీజ్ అయింది. అదే సంవత్సరం నవంబర్ నెలలో కొండవలస లక్ష్మణరావు చనిపోయారు. ఆ సమయానికి ఆయన వయసు 69 ఏళ్లే. కొండవలస 2015, నవంబర్ 2న మరణించారు. చెవిలో మొదలైన ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించిందని, ఇదే అతని మరణానికి దారితీసిందని వైద్యులు చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది కంటతడి పెట్టుకున్నారు. కొండవలస ఇక లేరు, హాస్యం ఆగిపోయింది అని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఒక చిన్న ఇయర్ ఇన్ఫెక్షన్ అతని ప్రాణాలను బలి తీసుకుంటుందని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేకపోయారు అనుకోకుండా ఆయన మరణించడం అందరిని కలచివేసింది. ఈ కమెడియన్ మొత్తంగా 65 సినిమాల్లో నటించారు. అతను నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అందువల్ల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మళ్లీ ఇలాంటి కమెడియన్‌ను రీప్లేస్ చేసేవారు ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: