ఇండియాలో ఆ డ్రోన్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి?
ఇప్పటికే పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసేందుకు టెస్టింగ్ లను సైతం మొదలు పెట్టాయి. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని సదరు సంస్థలు భావిస్తున్నాయి. దేశంలోని మహా నగరాలైన దిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో వీటిని ప్రవేశ పెట్టాలని తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ కు చెందిన డ్రోగో డ్రోన్స్ అనే డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలను నడపాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నాయని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ దన్నపనేని వెల్లడించారు. కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రాజెక్టు తో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఎయిర్ ట్యాక్సీలతో ప్రయాణం చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆటోలు, క్యాబ్ లు ఎక్కినట్టే ఈ డ్రోన్ ట్యాక్సీలను ఎక్కి ప్రయాణం చేయవచ్చని వివరించారు.
అదే సందర్భంలో సిటీలో ఎమర్జెన్సీ సేవల కోసం కొన్ని ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తామని సీఈవో యశ్వంత్ తెలిపారు. ఇప్పటికే ఆ కంపెనీ వ్యవసాయరంగానికి సేవలు అందిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తో పాటు పలు రాష్ట్రాల్లో 30 లక్షల ఎకరాల్లో పంటలపై పురుగుమందుల పిచికారీ చేసే డ్రోన్స్ ని సప్లై చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని యశ్వంత్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలను తీసుకొస్తే ట్రాఫిక్ కష్టాల నుంచి బయట పడినట్లు అవుతుంది. ప్రమాదంలో క్షతగాత్రులను, పేషేంట్లను కూడా కాపాడవచ్చు. మరి ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో మాత్రం చెప్పలేదు.