నిరుద్యోగులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. !
ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను రూపొందించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం పొందుతారు. అలాగే డీట్‌లో నమోదైన వివరాలను ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీకాలర్లు, హెల్త్‌కేర్ అసోసియేట్లు, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్‌లోనూ సాయం చేస్తోంది.
డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది.