ప్రపంచకప్ కు జట్టు కుదిరినట్టేనా .. ?

Prathap Kaluva

స్వంత గడ్డ పై సిరీస్ ను చేజార్చుకోవటం తో భారత్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలోకి కురికిపోయింది. ప్రయోగాల పేరిట అసలుకే ఎసరు వచ్చింది. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌నకు గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉన్నారా.. అంటే అదీ లేదు.. పోనీ కొత్త ఆటగాళ్లను పరీక్షించుకుందామంటే మ్యాచ్‌లు కూడా లేవు.. కనీసం ఐపీఎల్‌లో రాణించిన వారికైనా అవకాశం ఇస్తారా అంటే ఆ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టమైన సంకేతాలిచ్చారు.


మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ప్రపంచకప్ జట్టు కూర్పు కుదిరిందా? ప్రయోగాల పేరు చెప్పి సొంతగడ్డపై ఆసీస్ చేతిలో రెండు సిరీస్‌లు చేజేతులా చేజార్చుకున్నారు. అయినా మెగా ఈవెంట్‌కు వెళ్లే ఆ 15 మంది ఎవరనే దానిపై స్పష్టత వచ్చిందా? వీటికి సమాధానం లభించాలంటే జట్టు ఎంపిక వరకు ఆగాల్సిందేనా? విదేశాల్లో భారత్ వరుసగా సిరీస్‌లు గెలిచినప్పుడు ఇదే ప్రపంచకప్ జట్టు అన్నారు. మహా అయితే ఒకటి, రెండు స్థానాలపై కసరత్తులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వాటిని కూడా పూర్తి చేస్తాం.. అప్పట్లో విరాట్ చేసిన వ్యాఖ్యలివి.


చెప్పినట్లుగానే ఆసీస్‌తో సిరీస్‌లో చాలా ప్రయోగాలు చేశారు.. కానీ ఏ ఒక్కటి విజయవంతం కాకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. దీంతో కోహ్లీ ఇప్పుడు మాట మార్చి ప్రపంచకప్‌నకు సంబంధించిన ప్లాన్-ఏ సిద్ధంగా ఉందని చెబుతున్నాడు. అంటే కంగారూలతో సిరీస్‌లో ప్లాన్-బి విఫలమైందని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. దీనిని బట్టి తుది కూర్పుపై ఇంకా మేనేజ్‌మెంట్‌కు పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం ఎవరిది? రిజర్వ్ ఓపెనర్‌గా అవకాశం ఎవరికి ఇస్తారు? రెండో వికెట్ కీపర్ ఉంటాడా? లేడా? ఇలా ఈ సిరీస్‌లో సమాధానం దొరకని ఓ నాలుగైదు ప్రశ్నలకు విరాట్ ఏం జవాబిస్తాడో? చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: