హలో రోహిత్.. ఓటమి సరే.. కానీ ఇదేంటి?

praveen
2022 ఐపీఎల్  సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంటే.. ఎప్పుడూ అగ్రస్థానంలో కర్చీఫ్ వేసుకుని కూర్చునే ముంబై ఇండియన్స్ మాత్రం ఈసారి చిట్ట చివరన మూలుగుతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఐదుసార్లు టైటిల్ విజేత గా నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పిన ముంబై ఇండియన్స్ కు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి అని చెప్పాలి.


 దీంతో ఒకప్పుడు టైటిల్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించిన వారే ఇక ఇప్పుడు వరుస ఓటములు చూసి విమర్శలు చేస్తూ ఉండటం కూడా గమనార్హం. ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ అదరగొడుతుంది అని ప్రేక్షకుల అంచనాలు పెట్టుకోవడం చివరికి ఓటమి చవిచూసి ఆశలపై ముంబై ఇండియన్స్ నీళ్లు చల్లడం ఇదే జరుగుతూ వస్తోంది. ముంబై ఇండియన్స్ ఆడిన ఎనిమిదో మ్యాచ్ లో లక్నో జట్టుపై అయినా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. లక్నో చేతిలో ఓటమి చవిచూసింది.


 అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోవడం ఒక ఎత్తయితే కనీస పోటీ ఇవ్వకుండా భారీ పరుగుల తేడాతో ఓడిపోవడం మరో ఎత్తు. ముంబైపై లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల సాదా సీదా లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39, తిలక్ వర్మ 38,  పోలార్డ్ 13 పరుగులు మాత్రమే చేయగలిగారు.  ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కనీస పోటీ ఇవ్వలేక ఏకంగా 36 పరుగులతో ఘోర ఓటమి చవి చూడటం ఏంటి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడితే ఓడింది కనీసం పోటీ అయినా ఇవ్వాలి కదా అని విమర్శిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: