వరల్డ్ కప్: విండీస్ ను చిత్తు చేసి... ఘనంగా ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా !

VAMSI
నాలుగు వారాల నుండి నిర్విరామంగా జరుగుతున్న మహిళల 12 వ వరల్డ్ కప్ కు తెరదించే సమయం ఆసన్నమైంది. మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పాల్గొన్న ఈ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజి నుండి సెమీస్ కు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లు చేరుకున్నాయి. ఈ రోజు మొదటి సెమీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మరియు వెస్ట్ ఇండీస్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు అదే జోరును సెమీఫైనల్ లోనూ చూపించి వెస్ట్ ఇండీస్ ను చిత్తు చేసి ఫైనల్ కు చేరింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వర్షం కారణంగా కుదించిన 45 ఓవర్లకు 305 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ హీలీ (129) మరియు ఓపెనర్ హేన్స్ (85) మొదటి వికెట్ కు 216 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ ను అందించారు. వీరి దూకుడు ముందు వెస్ట్ ఇండీస్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలి పోయారు. అనంతరం 305 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ఓటమి అంతరం తగ్గించుకున్నారు.
ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు కేవలం 148 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి 157 పరుగుల భారీ ఓటమిని మూట గట్టుకుంది. వెస్ట్ ఇండీస్ మహిళలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ ను దాటగలిగారు. దీనితో ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంది. రేపు జరగనున్న రెండవ సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడుతుంది. వీరిద్దరిలో గెలిచిన జట్టుతో ఆస్ట్రేలియా ఏప్రిల్ 3 న ఫైనల్ ఆడనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ చరిత్రలో 6 సార్లు టైటిల్ సాధించింది. మరోసారి వరల్డ్ కప్ ను కొట్టడానికి రెడీ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: