ఈ సారి కృష్ణాష్టమి స్పెషల్ ఇదే... 101 ఏళ్ల తరువాత...!!

Vimalatha
నేటి ఉదయం శ్రీ కృష్ణ జన్మాష్టమి పుట్టిన రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను ఎక్కువగా ఉత్తరాది జనాలు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లోని మధురలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. విశేషమేమిటంటే జన్మాష్టమి నాడు అక్కడ ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడు పుట్టిన రోజు వేడుకలు జరుపుతారు. శ్రీ కృష్ణ విగ్రహానికి స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, ఉయ్యాలలో పడుకో బెట్టి ఊపుతారు. అంతే కాకుండా ఆయనకు మహాభిషేకం చేస్తూ, తామర పువ్వులతో పూజిస్తారు. కన్నయ్య జన్మదినాన్ని దక్షిణాది ప్రజలు కూడా విశేషంగా జరుపుకుంటారు.
అయితే ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉంటారు. దానివల్ల వారికి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఈసారి అలాంటి భక్తులకు మరింత మంచి జరిగే శుభ వార్త వచ్చింది. ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే 101 సంవత్సరాల తర్వాత ఈరోజున మహా సంయోగం, 25 సంవత్సరాల తర్వాత జయంతి యోగం ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి ముహూర్తానికి ఏర్పడుతోంది. దీంతో ఈ జన్మాష్టమి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమయంలో శాస్త్రాల ప్రకారం శ్రీ కృష్ణుడి పూజించడం వలన భక్తులకు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇంకేముంది ఈ ప్రత్యేక ముహుర్తాన మీరు కూడా ఉపవాసం ఉండి, శ్రీ కృష్ణుడిని ప్రసన్నం చేసుకొని, ఆయన అనుగ్రహం పొందండి.
కృష్ణుడు జన్మస్థలమైన మధురలో ఇప్పటికే కృష్ణాష్టమి వేడుకలు, సంబరాలు భారీగా మొదలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అక్కడ అన్ని దేవాలయాల్లోనూ శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పటికే మధురలోని ప్రధాన దేవాలయాలన్నీ దీపాలతో వెలిగిపోయాయి. నగర కూడళ్లు కూడా అద్భుతంగా అలంకరించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: