వరలక్ష్మీ వ్రతం పక్క రోజు... తప్పక పాటించాల్సిన నియమాలివే ?

VAMSI
వరలక్ష్మీ వ్రతం పెళ్ళైన స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పండుగ. సుదీర్ఘకాలం సుమంగళిగా పసుపు కుంకుమలతో వర్ధిల్లాలంటే స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం మన ఆచారంగా వస్తోంది. మాంగళ్య బలం, సకల సంపదలను, సుఖసంతోషాలను ప్రసాదించే, ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ‘'వర' అనగా శ్రేష్ఠమైన అన్న అర్థం కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. శ్రావణ మాసములో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ప్రధానంగా చేసుకుంటుంటారు. అలాగే ఈ మాసంలో వచ్చే మిగిలిన శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక వరలక్ష్మీ వ్రతం చేసిన మరుసటి రోజు అనగా శనివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము. అయితే వ్రతంలో ఉంచిన కలశాన్ని చాలా మంది అదే రోజు కదుపుతుంటారు. అంటే సాయంత్రం దీపం కొండెక్కాక కలశాన్ని తీయాలని అనుకుంటారు. కానీ శుక్రవారం రోజున కలశాన్ని అసలు తీయకూడదు, కనీసం కదప కూడదు. మరి కొందరు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపి ఆదివారం నాడు కలశాన్ని తీస్తుంటారు. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదని సకల శాస్త్రాలు చదివిన పండితులు అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం అయిన మరుసటి రోజు అనగా శనివారం నాడు కలశాన్ని తీయడానికి అనువైన సమయము. శనివారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసి, అమ్మ వారికి ఉప్పు లేకుండా కలిపిన పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.  
ఎంతో శ్రద్ధగా మంత్రాలతో అమ్మవారిని పూజించి దీపాలు కొండెక్కాక మొదట పసుపుతో చేసినటువంటి గణపతిని తీస్తూ 'యధాస్థానం ప్రతి గచ్ఛతి' అని చెప్పి నమస్కరించుకోవాలి. ఆ పసుపుని పుణ్య స్త్రీలు తమ మాంగళ్యాలకు రాసుకోవాలి. ఆ తరువాత అమ్మవారికి నమస్కరించుకుని ఆసనాన్ని, అలాగే కలశాన్ని కూడా తీసి యధాస్థానంలో పెట్టవచ్చు. ఇదంతా వరలక్ష్మి అయిన మరుసటి రోజు అనగా శనివారం రోజు మాత్రమే చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: