ఈ శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెలలో మహిళలు ప్రతి మంగళవారం, మరియు శుక్రవారం ప్రత్యేకంగా గౌరీ దేవిని పూజిస్తారు. ఈ మాసంలో మంగళ మరియు శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉన్నది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎంతో మంది మహిళలు శ్రావణ మాసంలో గౌరీ పూజలు చేసి అధ్భుత ఫలితాలను అందుకున్నారు. మన తెలుగు క్యాలెండర్ లో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉన్నది. శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసము అందుకే.. ఈ మాసంలో మహిళలు ముఖ్యంగా.. వివాహితలు ప్రతి మంగళ, శుక్రవారాలు గౌరీదేవికి నోములు, వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం కోసం తాపత్రయపడతారు.
ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో వారి సంతాన, సౌభాగ్యాలను సంరక్షిస్తారని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసం అనగా.. శుభ మాసము. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా పిలుస్తారు. నభో అనగా ఆకాశం అని అర్దము. ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శని వారాలు ఎంతో విశిష్టమైనవి అలాగే పవిత్రమైనవి అని పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈ నెలలో వచ్చే పర్వదినాలలో ప్రధానమైనవి కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, జంధ్యాల పౌర్ణమి, వరాహజయంతి, నాగ పంచమి, దామోదర ద్వాదశి, ఏకాదశి లు వస్తాయి.
వివాహితులు శ్రావణ మాసంలో గౌరీ పూజ చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యవంతులవుతారని ప్రతీతి. ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో అక్కడ సకల సంతోషాలు ఉంటాయి. ఏ ఇంట్లో అయితే మహిళ ఎంతో సౌమ్యంగా ఉంటూ, కంట తడి పెట్టకుండా, గొడవలు తలెత్తకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకోగలదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ మాసం అంత కూడా ప్రతి రోజూ ఇలా అమ్మవారిని పూజించడం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది.