కనులపండువ: విశాఖ తీరాన వేంకటేశ్వరుడు..!
ఇక ఈ ఆలయం వివరాల్లోకి వెళ్తే.. రుషికొండ బీచ్‌లోని గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గీతం మధ్య ఉన్న కొండపై ఈ ఆలయం కొలువుదీరింది. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. సుమారు 10 ఎకరాల భూమిలో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. ఆలయ విగ్రహ ప్రతిష్ఠ ఇతర సంప్రదాయాలు, మహా సంప్రోక్షణ మరియు అంకురార్పణం ఆగస్టు 9 నుండి 13 వరకు జరగనున్నాయి.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13 న ప్రారంభోత్సవానికి వస్తారని భావిస్తున్నారు. ఆగస్టు 13 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి నుండి వచ్చే పూజారులు ఒక వారం పాటు వైజాగ్‌లో పర్యటించి ఈ ఆలయ ప్రారంభానికి అవసరమైన ఆచారాలను నిర్వహిస్తారని చెబుతున్నారు.
ఇక ఆలయ వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి ప్రధాన దేవాలయంలోని విగ్రహం తరహాలోనే హనుమంతుని విగ్రహం కూడా వెంకటేశ్వర విగ్రహం ముందు ఉంటుంది. ప్రధాన దేవాలయం పక్కన భూదేవి మరియు శ్రీదేవి దేవాలయాలు కూడా ఉంటాయి. శ్రీవారి పాదాలు సహా అన్ని ఇతర దేవతల అంశాలు తిరుపతిలో శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ లో రూపొందించారు. ఈ ఆలయం ప్రాంగణంలో ఒక ధ్యాన మందిరం, వివాహ వేడుకలను నిర్వహించడానికి ఒక విందు హాల్ కూడా అందుబాటులో ఉన్నాయి.