ఈటల: 'ఈటె'లా లేదే.. పోటు దిగుద్దా..?

Chakravarthi Kalyan
ఈటల రాజేందర్.. ఇప్పడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. అయితే పేరుకే పేరులో ఈటెలు ఉన్నాయి కానీ.. ఆయన తీసుకునే నిర్ణయాల్లో అంతగా పదను కనిపించడం లేదు. ఆయన గత చరిత్ర చూసి.. వైఎస్సార్ లాంటి నాయకుడిని సైతం ఎదుర్కొన్న తీరు చూస్తే.. అబ్బో ఈటల మామూలోడు కాదు అన్న అభిప్రాయం ఉండేది.. కానీ.. ఎందుకో ఇప్పుడు ఈటల వ్యవహారశైలిలో అంత ఈటెల్లాంటి పదును కనిపించడం లేదు.
ఈటె అంటే ఎలా ఉంటుంది. మంచి ఒడుపు చూసి ఈటె విసిరితే ఎంతటి సింహం అయినా నేల కూలాల్సిందే. గురి చూసి కొడితే.. ఎలాంటి భయంకరమైన జంతువైనా నిట్టనిలువునా కూలిపోవాల్సిందే. మరి ఈ ఈటల సంగతి.. ఒకప్పటి సంగతేమో కానీ.. ఇప్పుడు ఈ ఈటెకు అంత పదును కనిపించడం లేదు. మరి వ్యాపారాలు తెచ్చిన ముందరి కాళ్ల బంధనాలో.. ఇంకేమైనా లొసుగులో తెలియదు కానీ.. ఈటల వ్యవహారం అనుకున్నంత దూకుడుగా లేదు.
అసలు కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకోవాలంటేనే ఎన్నో ఆలోచించాలి. ఎంతో మథనం చేయాలి. అప్పుడు కానీ.. ఓ నిర్ణయానికి రాకూడదు. అదంతా ఆలోచించే వరకే. కానీ ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఈటెలా దూసుకుపోవాల్సిందే. నాన్చితే కుదరదు. ఆ గ్యాప్‌లో కేసీఆర్ వంటి నాయకులు ఎన్ని వ్యూహాలైన పన్నగలడు. మరి ఈటల మాత్రం అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.
ముందుగా సొంత పార్టీ పెడతారన్న వార్తలు వచ్చాయి. కానీ.. అంగ బలం, అర్థబలం చాలవనుకున్నారో ఏమో.. మొత్తానికి ఆ నిర్ణయం విరమించుకున్నారు. అంతే కాదు..ఓ బలమైన అండ ఉంటే తప్ప కేసీఆర్ ఎత్తులను నుంచి కాపాడుకోలేం అనుకున్నారేమో అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పోనీ.. ఆ చేరేదైనా వెంటనే చేరారా.. అంటే అదీ లేదు. ఇంకా నాన్చుడే. కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకునేటప్పుడు వ్యూహాలు చకచకా ఈటెల్లా లేకపోతే.. కష్టమే. మరి ఈ ఈటల ఎలా నెగ్గుకొస్తాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: