హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్న చెప్పినదాన్నే కాకిలెక్కలంటారు

Vijaya
వెనకటికి టీడీపీలో ఓ సీనియర్ నేతుండేవారు.  ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడుతు తిరుపతిలో లక్షా డెబ్బై ఐదువేల కాకులున్నాయని చెప్పారు. సదరు నేత చెప్పినదానికి ఆధారం ఏమిటని అడిగినపుడు మీరు కావాలంటే లెక్క పెట్టుకోమని చెప్పారు. తిరుపతే కాదు ఏ ఊరిలో అయినా ఇన్ని కాకులే ఉన్నాయని ఎవరైనా ఎలా చెప్పగలరు ? కాకుల లెక్కలకు ఆధారాలు ఏముంటాయి ?  అందుకే దీన్నీ కాకిలెక్కలంటారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పిన లెక్క కాకిలెక్క లాగేఉంది. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చెన్న ‘రాష్ట్రంలో ఇఫ్పటివరకు ప్రభుత్వ వైఫల్యం వల్ల 8889 మంది కరోనా రోగులు చనిపోయార’ని చెప్పారు.



అలాగే ఆక్సిజన్ అందక చనిపోయిన 76 మందివి ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. అయితే ప్రభుత్వ హత్యలుగా ఎవరు పరిగణించాలో మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ప్రభుత్వం అంగీకరించదు. పోనీ టీడీపీ పరిగణిస్తోందని చెబితే దాన్ని ప్రభుత్వం లెక్కచేయదు. మరి 76 మంది మరణాలను ప్రభుత్వ హత్యలుగా ఎవరు పరిగణించాలి ? ప్రభుత్వ వైఫల్యం వల్ల 8889 మంది చనిపోయినట్లు అచ్చెన్న ఎలా చెప్పారు ? అంటే దానికి ఏమీ ఆధారంలేదు. ఏదో నోటికొచ్చినట్లుగా ఆరోపణ చేసినట్లే ఉంది చూస్తుంటే. నిజంగానే అచ్చెన్న చెప్పినట్లుగా 8889 మంది చనిపోతే వాళ్ళ పేర్లు, అడ్రస్సులతో సహా వివరాలన్నీ ఇస్తేనే జనాలు కూడా నమ్ముతారు. అవేమీ లేకుండా ఏదో నోటికొచ్చిన సంఖ్యను చెప్పేసి నమ్మండంటే జనాలేమన్నా అమాయకులా ?



ఇపుడు అచ్చెన్న చెప్పింది కూడా కాకిలెక్కనే అర్ధమైపోతోంది. ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా మారు మాట్లాడకుండా చెప్పింది విని రాసుకుని, అచ్చేసే మీడియా ఉందనే ధైర్యంతోనే చంద్రబాబునాయుడు, అచ్చెన్న అండ్ కో ఇలాగే మాట్లాడేస్తున్నారు. తమ మాటలకు విశ్వసనీయత లేదని తెలిసీ జగన్ పై ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం వంతులవారీగా బురదచల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటే ఎవరు ఏమీ చేయగలిగేదిలేదు. ప్రధాన ప్రతిపక్షమన్నాక చేసే ఆరోపణలు, విమర్శలు కాస్త పద్దతిగా ఉంటేనే జనాల్లో విశ్వసనీయత పెరుగుతుంది. లేకపోతే ఏదో మాట్లాడాం, మన మీడియా కూడా అచ్చేసింది అని తమలో తాము సంతోషించడానికి తప్ప ఇలాంటి స్టేట్మెంట్లు దేనికి పనికిరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: