హెరాల్డ్ సెటైర్ :  గవర్నర్ దగ్గర నిమ్మగడ్డకు వర్కవుటైనట్లు లేదే ..ఏం జరిగుంటుంది ?

Vijaya
గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ కలిసిన రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పెద్దగా వర్కవుటైనట్లు అనిపించటం లేదు. హైకోర్టు సూచనలతో గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ తన బాధనంతా వెళ్ళబోసుకున్నాడు. తనను కమీషనర్ గా నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా రాష్ట్రప్రభుత్వం పాటించటం లేదని ఫిర్యాదు చేశాడు. కాబట్టి తక్షణమే జోక్యం చేసుకుని తనను మళ్ళీ కమీషనర్ గా నియమించాలంటూ గవర్నర్ ను నిమ్మగడ్డ విజ్ఞప్తి చేసుకున్నాడు. సరే ఇంతకన్నా నిమ్మగడ్డ చేయగలిగింది కూడా లేదు కాబట్టి ఈ విషయాన్ని పక్కనపెట్టేద్దాం. నిజానికి తాను కలవగానే తనను కమీషనర్ గా గవర్నర్  నియమించేస్తాడని నిమ్మగడ్డకు కూడా నమ్మకం ఉండి ఉండదు. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించకుండానే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అందరికీ తెలిసిందే.

అసలు సమస్య మొదలైందే నిమ్మగడ్డ వైపునుండి. ప్రాసెస్ లో ఉన్న స్ధానిక సంస్ధల ఎన్నికలను ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా వాయిదా వేసేయటమే నిమ్మగడ్డ చేసిన తప్పు. అదేమంటే దేశంలో కరోనా వైరస్ సమస్య పెరిగిపోతోంది కాబట్టే ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేసినట్లు కతలు చెప్పాడు. ప్రజా క్షేమాన్ని చూసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కన్నా ఎన్నికల కమీషనర్ కు ఎక్కువుంటుందా ? పైగా కరోనా వైరస్ ను బూచిగా చూపినపుడు రాష్ట్రం మొత్తంమీద నెల్లూరులో ఒక్క కేసు మాత్రమే బయటపడింది. నిజంగానే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నపుడు ముందు చర్చించాల్సిందే ప్రభుత్వంతో. కానీ ఆ పని మాత్రం నిమ్మగడ్డ చేయలేదు. ఇక్కడే ఆయన దురుద్దేశ్యం బయటపడిపోయింది. దాంతో ప్రభుత్వం ఆయన్న కమీషనర్ గా తీసేసింది.

ఇక అక్కడి నుండి ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య ఆధిపత్యం కోసం టామ్ అండ్ జెర్రీ పోరాటం సాగుతునే ఉంది. హైకోర్టుకెళ్ళాడు, తర్వాత సుప్రింకోర్టుకు వెళ్ళాడు. మళ్ళీ హైకోర్టుకొచ్చాడు. ఇపుడు మళ్ళీ గవర్నర్ ను కలిశాడు. ఎక్కడెకెళ్ళినా నిమ్మగడ్డకు న్యాయమైతే జరగటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోనే పోస్టింగు ఎలా సంపాదించుకోగలనని నిమ్మగడ్డ ఎలా అనుకుంటున్నాడో. ప్రభుత్వంలో పోస్టింగ్ కావాలని అనుకుంటున్న అధికారి ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలే కానీ ఘర్షణకు దిగితే ఎలాగ ?  ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ఆడమన్నట్లు ఆడిన ఫలితమే ఇప్పటి నిమ్మగడ్డ వ్యవహారం.

సరే తాజాగా గవర్నర్ తో భేటిలో సానుకూల వాతావరణం ఏమీ ఉన్నట్లు లేదు. తనను ఎవరు కలిసినా గవర్నర్ విజ్ఞప్తి తీసుకుంటారు, చూస్తాను పొమ్మనటం సహజమే. ఇపుడు కూడా అంతే జరిగుంటుంది. నిమ్మగడ్డ పేరుతో జారీ అయిన ప్రెస్ రిలీజ్ లో కూడా అంతేఉంది. అలా కాకుండా నిమ్మగడ్డకు అనుకూలంగా గవర్నర్ స్పందన గనుక ఉండి ఉంటే ఈపాటికే ఎల్లోమీడియాలో ఓ రేంజిలో  మోత మోగిపోతుండేది. దీంతోనే తెలిసిపోతోంది నిమ్మగడ్డకు వర్కవుట్ కాలేదని. ఎలాగూ హై కోర్టు కూడా చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది. అందుకనే గవర్నర్ ను కలవమని నిమ్మగడ్డకు చెప్పి హైకోర్టు చేతులు దులిపేసుకుంది. చూద్దాం చివరకు నిమ్మగడ్డ వ్యవహారం ఎలాగ ముగుస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: