గుడ్‌ న్యూస్‌: కరోనా కాలర్‌ ట్యూన్‌ ఎత్తేస్తున్నారట?

Chakravarthi Kalyan
కరోనా కాలర్ ట్యూన్.. దాదాపు రెండేళ్ల నుంచి దేశ ప్రజలను విసిగిస్తున్న ఓ కాలర్ ట్యూన్.. ఎవరికి ఫోన్ చేద్దామన్నా నెంబర్ డయల్ చేయగానే ముందుగా ఈ కరోనా కాలర్ ట్యూన్ వినిపించేది. ఆ కరోనా జాగ్రత్తలు చెప్పే ఈ ట్యూన్ పూర్తయితే గానీ.. మనకు కావాల్సిన కాల్ కనెక్ట్ కాదు.. అత్యవసరమైన సమయాల్లో ఈ కాలర్ ట్యూన్ చాలా ఇబ్బంది కరంగా తయారైంది. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.. ఈ కరోనా కాలర్ ట్యూన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని జోక్స్, పేరడీలు, మీమ్స్ వచ్చాయి.

ఇప్పుడు శుభావార్త ఏంటంటే.. ఇకపై ఆ కరోనా కాలర్ ట్యూన్ ఎత్తేస్తున్నారట. కొవిడ్‌-19పై అవగాహన కోసం టెలికం ఆపరేటర్లు ఈ ప్రీకాల్‌-ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్లు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ కాలర్ ట్యూన్‌ను తప్పని సరి చేశారు. ఇకపై ఈ కాలర్ ట్యూన్‌ను తీసేస్తున్నారట. త్వరలో ఈ కాలర్ ట్యూన్ నిలిచిపోతుందట. దేశంలో కరోనా కేసులు బాగా  తగ్గు ముఖంపట్టాయి. సర్కారు కూడా మాస్క్, భౌతిక దూరం తప్ప.. మిగిలిన కరోనా నిబంధనలు ఎత్తేసింది.

ఎన్ని నిబంధనలు ఎత్తేసినా.. ఇంకా కరోనా కాలర్ ట్యూన్ మాత్రం ప్రజలను సతాయిస్తూనే ఉంది. అందుకే ఇకపై దాన్ని కూడా ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ ప్రీకాల్‌-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందని ఇప్పటికే చాలామంది ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏంటంటే.. కొందరు ఈ విషయంలో కోర్టులను కూడా ఆశ్రయించారు. అయినా అన్నింటి కంటే ప్రజారోగ్యం ముఖ్యం కనుక ఈ ట్యూన్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు.

కరోనా వాతావరణం పూర్తిగా తొలగిపోయిన నేపథ్యంలో ఇకనైనా ఆ కరోనా ట్యూన్ తీసేయండి మహా ప్రభో అంటూ బోలెడు విజ్ఞప్తులు వచ్చి పడుతున్నాయట. అందుకే దీన్ని తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీ కమ్యూనికేషన్ల విభాగం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాసింది. భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి కూడా దీన్ని తీసేయాలని విజ్ఞప్తులు వచ్చాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: