ఆ క్రికెటర్లకు గాలం వేస్తోన్న సిద్దూ.. వర్కవుట్ అవుతుందా..?

Chakravarthi Kalyan
పంజాబ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అక్కడ ఎలాగైనా మూడోసారి కూడా గెలవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. పంజాబ్ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్న మాజీ క్రికెటర్ సిద్దు అమరీందర్ సింగ్ నిష్క్రమణ తర్వాత పార్టీపై పూర్తిగా పట్టు సాధించాడు.. ఎలాగైనా పార్టీని విజయ తీరాలకు చేర్చి సీఎం కుర్చీ ఎక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ఇందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రముఖ పంజాబీ క్రికెటర్లను కాంగ్రెస్‌వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి పంజాబీ క్రికెటర్లపై ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల కన్ను పడింది. ఎలాగైనా వీరిని తమ పార్టీలో చేర్చుకోవాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే హర్బజన్ సింగ్ మాత్రం రాజకీయాలపట్ల అంత ఆసక్తి లేదంటున్నాడు. అయితే ఇప్పటికే  పంజాబ్ ఎన్నికల ముందు  భజ్జీ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీన్ని భజ్జీ తోసిపుచ్చాడు.

ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పై  సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. హర్భజన్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సిద్ధూ కొన్ని సాధ్యమేననే అర్థం వచ్చేలా కామెంట్లు పెట్టాడు. భజ్జి షైనింగ్‌ స్టార్‌ అంటూ ఆ పోస్టులో సిద్ధూ కామెంట్ చేశాడు. పంజాబ్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సిద్దూ పెట్టిన ఈ పోస్టు ఆసక్తి రేపుతోంది. భజ్జీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. ఈ ఫోటో ద్వారా సిద్ధూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సిద్దు పెట్టిన ఫోటోతో బీజేపీలో కంగారు పెరిగింది. మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ తమ పార్టీలోనే చేరతారని బీజేపీ దీమాగా ఉంది. ఇప్పుడు సిద్దూ కాస్త అడ్వాన్స్ కావడంతో కమలదళంలో కంగారు పెరిగింది. అబ్బే వాళ్లిద్దరూ మాతోనే ఉన్నారని బీజేపీ నేతలు కవరింగ్ చేసుకుంటున్నారు. మరి ఇంతకూ ఈ ఇద్దరు క్రికెటర్లు ఏ జట్టులో చేరి రాజకీయ క్రికెట్ ఆడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: