మీ మెదడు తుప్పుపట్టి పోతోంది.. కావాలంటే చెక్‌ చేసుకోండి..

Chakravarthi Kalyan
కాలం ఎవరి కోసం ఆగదు.. కాల ప్రవాహంలో ఎన్నో మార్పులు వస్తుంటారు.. కొత్తవి వస్తుంటాయి.. పాతవి పోతుంటాయి. అయితే.. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది. టెక్నాలజీపై మనం ఆధారపడటం పెరుగుతోంది. ఈ దశాబ్ద కాలంలో మనిషిని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఆవిష్కరణ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక జీవనం మరింత ఆధునికత సంతరించుకుంది.
ఎవరితో మాట్లాడాలన్నా స్మార్ట్‌ ఫోన్‌..
ఏదైనా తెలుసుకోవాలన్నా స్మార్ట్‌ఫోన్..
ఏ సందేహం వచ్చినా స్మార్ట్‌ఫోన్..  
ఏదైనా రాసుకోవాలన్నా స్మార్ట్‌ఫోన్‌..
లెక్క చేయాలన్నా స్మార్ట్‌ఫోన్..
వినోదం కావాలన్నా స్మార్ట్‌ఫోన్..
విజ్ఞానం కావాలన్నా స్మార్ట్‌ఫోన్..
ఇప్పుడు పన్నెండు పదమూళ్లు ఎంతో చెప్పండి.. అంటే స్మార్ట్‌ ఫోన్‌ తీసి లెక్క చేయాల్సిందే.. ఫలనా వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ కావాలంటే.. ఆల్ఫాబెటికల్‌లో పేరు చెక్ చేయాల్సిందే. అంతకు ముందు ఈ సౌకర్యం లేదు. అప్పుడు మెదడు పాదరసంలా పనిచేసేది.. 20 ఎక్కాల వరకూ బట్టీ వేయించేవాళ్లు పంతుళ్లు.. ఇప్పుడు ఆ అవసరం లేదు.
అంతకుముందు.. ఎంత మంది స్నేహితుల నెంబర్లయినా నోటికి వచ్చేవి.. కనీసం ఓ 10 నెంబర్లయినా ఠక్కున చెప్పగలిగే వాళ్లం.. కానీ ఇప్పుడు.. మన నెంబర్ తప్ప కనీసం ఇంట్లో వాళ్ల నెంబర్లు కూడా గుర్తు పెట్టుకోవడం లేదు.. గుర్తు పెట్టుకోలేక కాదు.. ఆ అవసరం లేక.. మరి అవసరం లేదని ఉపయోగించడం మానేస్తే.. రేపు అవసరం వచ్చినప్పుడు మన మెదడు ఉపయోగపడుతుందా.. ఇప్పుడు ఈ అనుమానమే నాకు పెరిగిపోయింది. ఇలా వాడకుండా ఉండటం వల్ల కొంపదీసి మన మెదడు కాస్తా తుప్పుపట్టదు కదా.. ఏమో.. ముందు ముందు ఏం జరుగుతుందో..?
అందుకే కాస్త అప్పుడప్పుడు  బుర్ర వాడే పని చేయండి.. కొన్ని నెంబర్లయినా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి.. కాస్త అప్పుడప్పుడు పజిల్స్ పూర్తి చేయండి.. కాస్త మెదడుకు మేత పెట్టండి.. లేకపోతే.. ఆ మెదడుకు పదును లేకుండా పోయే ప్రమాదం ఉంది.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: