జగన్ పర్యటనతో వైకాపా శ్రేణుల్లో నూతనోత్తేజం

Chowdary Sirisha

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో గతంలో చేపట్టిన ఓదార్పుయాత్రను ఏవిధంగా పూర్తిస్థాయిలో విజయవంతం చేశారో అదేస్థాయిలో జిల్లాలో జగన్ చేపట్టిన బస్సు యాత్రను ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి దిగ్విజయంగా విజయవంతం చేశారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ వలన జరిగే నష్టాలను వివరించేందుకు జగన్ రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర గురువారం జిల్లాకు చేరుకుంది. తొలుత జిల్లా సరిహద్దుల్లోని సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద జగన్‌ను చూసేందుకు జిల్లాలోని నలుమూలప్రాంతాలనుండి అశేషంగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వెలుగొండప్రాజెక్టు వద్ద జరిగిన రైతు ముఖాముఖి కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనుండి జగన్ ప్రసంగాన్నివినేందుకు తరలివెళ్ళారు. జగన్ పర్యటన ముందురోజునే జగన్ బాబాయి ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జిలతో సమావేశమై జగన్ పర్యటన విజయవంతం చేసేవిధంగా ప్రణాళికలను రూపొందించారు.

వైవి ముందస్తు వ్యూహాంలో భాగంగానే జగన్ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో పార్టీశ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్నారు. జగన్ పర్యటన ఆలస్యమైనప్పటికీ అశేషంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఇంటిదారి పట్టకుండా జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తిచూపారని పార్టీశ్రేణులు పేర్కొంటున్నాయి.అదేవిధంగా జగన్ జైలులో ఉన్న సమయంలోను జిల్లాపార్టీని ఏకతాటిపై వైవి సుబ్బారెడ్డి నడిపారన్న చర్చ పార్టీశ్రేణుల్లో వ్యక్తవౌతుంది. జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర జిల్లాలోని గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె నుండి ప్రారంభమై తడ వరకు సాగింది. ఈ 43రోజుల పాటు జగన్ ఓదార్పులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాబాయి వైవి సుబ్బారెడ్డి చర్యలు తీసుకున్నారు.ఇదిలా ఉండగా జగన్ చేపట్టిన బస్సుయాత్రలో ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తళుక్కుమన్నారు. దీంతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.కాగా తన ప్రసంగంలో తన తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోపక్క ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నంతసేపు వైకాపా నాయకులు, కార్యకర్తల నుండి జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరేత్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: